Friday, November 15, 2024

ఏపీ పరిణామాలపై కేంద్రం ‘నిఘా’ నేత్రం .. టీడీపీ సభలపై ప్రత్యేక ఫోకస్

ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, సెంట్రల్ ఆంధ్ర : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు తరలివస్తున్న జనం, వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్న స్పందన, కందుకూరు ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం.. తదితర అంశాలపై ఇప్పటికే సవివరంగా నివేదిక పంపినట్టు సమాచారం. కందుకూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియో ప్రకటించటం రాజకీయ వర్గాలలో ప్రత్యేకంగా చర్చనీయాంశం అయింది.

తుఫానులు, విపత్తులు, వరదలు, వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా జరిగే దుర్ఘటనలపై ప్రధాని స్థాయిలో వారు ఎక్కువగా స్పందిస్తుంటారు. అయితే ఒక రాజకీయ పార్టీ సభలో జరిగిన దుర్ఘటనపై ప్రధాని స్థాయిలో అత్యంత వేగంగా స్పందించటం ఎంతో అరుదుగా జరుగుతుంటుంది. కందుకూరు ఘటనలో ప్రధాని స్పందనకు రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది.

కేంద్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ మీడియా సైతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఫోకస్ పెట్టింది. దీర్ఘకాలం తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు గల కారణాలపై ఆసక్తికర కథనాలు ప్రచురించసాగాయి. ప్రధానంగా తెలంగాణలో బిఆర్ ఎస్ ఆవిర్భావంతో రాజకీయాలలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న అంశంపై విస్తృత చర్చ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు అధికార పార్టీలను ఇరకాటంలో పెడుతున్న వాతావరణం కానవస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement