Monday, November 18, 2024

శ్రీలంక దుస్థితికి అపరిమిత అప్పులే కారణం.. ఏపీ, తెలంగాణ అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితికి రాజకీయ పరిస్థితులతో పాటు, స్థాయికి మించి అపరిమితంగా చేసిన అప్పులే కారణమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు వివిధ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. శ్రీలంక సంక్షోభంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖాధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై కూడా అధికారులు రెండవ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పులు దేశానికి చేటు చేస్తాయని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు చేసే అప్పులను ప్రస్తావించడం, వివరించడాన్ని టీఆర్ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిమితికి మించి కేంద్రం చేసే అప్పులను కూడా తెలియజేయాలని డిమాండ్ చేశారు. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్ ఏంటని నిలదీశారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ ఉందని సమావేశంలో నామా చెప్పుకొచ్చారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్‌తో పాటు విపక్షాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాయి. తెలంగాణ జీఎస్డీపీలో 23% కంటే ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారనే వాదనను టీఆర్‌ఎస్ తోసిపుచ్చింది. ఇదే కేంద్ర ప్రభుత్వం 59% పైగా అప్పులు తీసుకుందని, దానికి జవాబు ఎవరిస్తారని ఎంపీ కేశవరావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఎఫ్‌ఆర్బీఎం 3.5% పరిధిలోనే ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏకంగా 6.2% శాతాన్ని దాటాయని ఆయన వివరించారు. తీసుకున్న అప్పులను చెల్లించడంలో తెలంగాణ నిర్లక్ష్యం చేసిందా అని నిలదీశారు. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement