న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లవుతున్నా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ప్రక్రియలో కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. భవన్ విభజనపై అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు కోరిన కేంద్ర హోంశాఖ.. ఏప్రిల్ 26న జరిగిన సమావేశంలో ఆ ప్రతిపాదనలను స్వీకరిస్తూ తానొక సరికొత్త ప్రతిపాదనను తెలుగు రాష్ట్రాల ముందు పెట్టింది. ఆ ప్రతిపాదనపై అభిప్రాయం లేదా అంగీకారాన్ని వారం రోజుల్లోగా తెలియజేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 66 ప్రకారం రాష్ట్రం వెలుపలి ఉమ్మడి ఆస్తుల విభజన కోసం జనాభా నిష్పత్తి (58:42) ప్రకారం పంచుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ మొత్తం విస్తీర్ణం 19.73 ఎకరాలు. దీన్ని 58:42 నిష్పత్తిలో లెక్కిస్తే తెలంగాణకు 8.41 ఎకరాలు (41.68%) భూభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11.32 ఎకరాల (58.32%) స్థలాన్ని పంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న భవన్ స్థలం అంతా ఒకే చోట లేదు. గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలం ఒకదానికొకటి ఆనుకుని మొత్తం 12.09 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో గోదావరి, శబరి బ్లాకుల్లో నిర్మించిన భవనాలున్నాయి.
నర్సింగ్ హాస్టల్ స్థలంలో పాత స్టాఫ్ క్వార్టర్లు ఉండగా సగానికి పైగా ఖాళీ స్థలం ఉంది. దీనికి కొంచెం దూరంలో జశ్వంత్ సింగ్ రోడ్‌లో పటౌడీ హౌజ్ పేరుతో 7.64 ఎకరాల స్థలం ఉంది. పటౌడీ హౌజ్‌లో కొన్ని పాతకాలపు స్టాఫ్ క్వార్టర్స్ మినహా మొత్తం ఖాళీ స్థలమే ఎక్కువగా ఉంది. ఈ స్థలాన్ని 58:42 నిష్పత్తికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ప్రతిపాదనలు తీసుకొచ్చింది. వీటిని కేంద్ర హోంశాఖ ఆప్షన్ ఏ, బీ, సీ గా పేర్కొంది.
మొదట్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మొత్తం స్థలం తమకే దక్కుతుందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వాదించారు. నాటి నైజాం రాజులు నిర్మించిన ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌజ్’ను కేంద్ర ప్రభుత్వం తీసుకుని, అందుకు ప్రతిఫలంగా ఇచ్చిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించినందున తమకే మొత్తం స్థలాన్ని కేటాయించి, ఆంధ్రప్రదేశ్‌కు మరెక్కడైనా కొత్తగా స్థలాన్ని కేటాయించాలని సూచించింది. కానీ విభజన చట్టం ప్రకారం ఇది సాధ్యం కాదు. రాష్ట్రం వెలుపలి ఉమ్మడి ఆస్తులను విభజన చట్టం ప్రకారం మాత్రమే పంచుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ ప్రకారం 12.09 ఏకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని తెలంగాణకు ఇచ్చి, పటౌడీ హౌజ్ (7.64 ఏకరాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. తెలంగాణకు దక్కాల్సిన వాటా కంటే అదనంగా ఇస్తున్న భూమికి తగిన విలువను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆ ప్రతిపాదనలో పేర్కొన్నట్టు సమాచారం. దీన్ని కేంద్ర హోంశాఖ ఆప్షన్-డీగా రికార్డుల్లో పేర్కొంది.
ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీలు (కేంద్ర-రాష్ట్ర సంబంధాలు) సంజీవ్ కుమార్ జిందాల్, జి. పార్థసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ తమ ప్రతిపాదనలను అందజేశాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ సురేందర్ కాసల, ఏఈఈ ఆశిష్ పాండే హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి ఎల్. ప్రేమ్‌చంద్రారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ హాజరయ్యారు.
ఆప్షన్-ఈతో ముందుకొచ్చిన హోంశాఖ.. తెలంగాణ ప్రతిపాదనకు భిన్నమైన ప్రతిపాదన
తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు పూర్తి భిన్నమైన ప్రతిపాదనతో చేసిన కేంద్ర హోంశాఖ ముందుకొచ్చింది. 7.64 ఏకరాల్లో ఉన్న పటౌడి హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఏకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ సూచనతో జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు దక్కాల్సినంత భూమి దాదాపుగా వస్తుందని, స్వల్పతేడాకు ఇవ్వాల్సిన మొత్తం కూడా చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సానుకూలత వ్యక్తం చేస్తూ ఆమోదయోగ్యంగా, సాధ్యపడేలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై పరిశీలించి తమ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన అధికారులు ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతనే తెలియజేస్తామని చెప్పినట్టుగా తెలిసింది. మొత్తమ్మీద ఏప్రిల్ 26న జరిగిన సమావేశం మినట్స్‌లో ఈ అన్ని అంశాలతో పాటు చివర్లో ఆప్షన్-సీ, ఆప్షన్-డీ, ఆప్షన్-ఈ పై రెండు రాష్ట్రాలు తమ తమ అభిప్రాయాలు, వీలైతే అంగీకారం తెలపాలని కేంద్ర హోంశాఖ సూచించింది.