హిందూ మాల రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ, ఇతర మతాలు క్రైస్తవం, ఇస్లాంలను ఆచరిస్తున్న వారికి రిజర్వేషన్‌లు అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు అక్టోబర్ 11న సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డు కులాలకు చెందిన వారై ఉండి, క్రిస్టియన్లుగా, ముస్లింలుగా మతమార్పిడి చెందిన వారిపై అధ్యయనం చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సోమవారం నిర్ణయించింది. హిందుమతం, బౌద్ధమతం, సిక్కు మతాలను ఆచరించకుండా క్రిస్టియన్లు లేదా ముస్లింలుగా మతమార్పిడి చెందిన షెడ్యూల్డ్ కులం లేదా దళితుల సామాజిక,ఆర్థిక, విద్య స్థితిగతులను అధ్యయనం చేయడానికి కేంద్రప్రభుత్వం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ కమిషన్‌పై కేంద్రం చర్చించి త్వరలో ఏర్పాటు చేయనుందని మైనార్టీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ, డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ శాఖలు వెల్లడించాయి. ఆ శాఖల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే, కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కమిటీ ప్రతిపాదనలపై హోం, లా, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్, ఆర్థిక శాఖల మంత్రుల వద్ద చర్చలు జరుగుతున్నాయి. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులం)ఆర్డర్, 1950, ఆర్టికల్ 341 ప్రకారం, హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజంలను పాటించకుండా ఏ ఇతర మాతాల్లో ఉన్నా, వారు షెడ్యూల్డ్ కులం కాదని స్పష్టం చేస్తోంది.
1956లో సిక్కులను, 1990లో బౌద్ధమతాన్ని చేర్చడం జరిగింది. మతం మారిన షెడ్యూల్డ్ కులాలు లేదా దళితులకు ఎస్సీ రిజర్వేషన్ల అమలు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వడానికి మూడు వారాల సమయం ఇవ్వాల్సిందిగా, సుప్రీంకోర్టు త్రిసభ్యధర్మాసనం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్‌లను ఆగస్ట్ 30న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీంతో, కేసు విచారణ అక్టోబర్ 11కు లిస్ట్ అయింది. దీంతో, కేంద్ర ప్రభుత్వం హడావుడిగా అధ్యయన కమిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది.