Saturday, November 23, 2024

Delhi | పసుపు బోర్డుకు కేంద్రం ఆమోదం.. 2030నాటికి 8వేల కోట్ల విలువైన ఎగుమతులే లక్ష్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలోని నిజామాబాద్ పరిసర ప్రాంత రైతుల చిరకాల వాంఛ ‘పసుపు బోర్డు’ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొద్దిరోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించగా, ఆ మాటను నిజం చేస్తూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఆహారంగా, ఔషధంగా, సౌందర్య సాధనంగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్న పసుపు పంటను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచి పసుపు రైతులకు మెరుగైన ధర అందించడం, పసుపు ఎగుమతులను పెంచడం లక్ష్యంగా ఈ బోర్డు పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇప్పటి వరకు సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల్లో భాగంగా ఉన్న ‘పసుపు’ కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయడం వల్ల దేశంలో పసుపు సాగు చేసే రైతులతో పాటు పసుపుపై ఆధారపడ్డ అనేక రంగాలకు విస్తృత ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. ఈ బోరడు స్పైసెస్ బోర్డుతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని కేంద్రం వెల్లడించింది. అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌ల నుంచి ప్రభావవంతంగా రక్షణ కల్పించే సహజ గుణం ఉన్న ‘పసుపు’ ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో పసుపుపై అవగాహన పెంపొందించుకుంటూ వినియోగాన్ని మరింత పెంచడానికి, ఎగుమతులను వృద్ధి చేయడానికి అంతర్జాతీయంగా కొత్త మార్కెట్‌లను అన్వేషించడానికి, కొత్త ఉత్పత్తుల కోసం పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ పసుపు బోర్డు ఉపయోగపడుతుంది. పసుపు ఉత్పత్తిదారుల సామర్థ్యం పెంపుదల, నైపుణ్యాభివృద్ధిపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది.

బోర్డు కూర్పు ఎలా ఉంటుంది?

ఈ బోర్డుకు ఛైర్‌పర్సన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సభ్యులుగా ఆయుష్, ఔషధాలు, వ్యవసాయం, రైతు సంక్షేమం, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖలతో పాటు మూడు రాష్ట్రాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు (రొటేషన్ ప్రాతిపదికన), పరిశోధనలో నిమగ్నమైన జాతీయ, రాష్ట్ర సంస్థల ప్రతినిధులు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులు ఉంటారు. అలాగే వాణిజ్య శాఖ కార్యదర్శిని నియమిస్తుంది.

పసుపు సాగులో, ఎగుమతిలో నెంబర్ 1

పసుపును ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా ఉంది. 2022-23 సంవత్సరంలో 11.61 లక్షల టన్నుల (ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 75% పైగా) ఉత్పత్తి భారత్‌లో జరిగింది. మొత్తం 3.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు సాగు జరిగింది. భారతదేశంలో 30 కంటే ఎక్కువ రకాల పసుపు దేశంలోని 20 రాష్ట్రాలలో పండిస్తున్నారు. పసుపును ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సాగు చేస్తున్నాయి.

రూ. 8వేల కోట్ల ఎగుమతులే లక్ష్యం

ప్రపంచ వాణిజ్యంలో పసుపు విక్రయాల్లో భారతదేశం 62% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2022-23 సమయంలో 207.45 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చేసే 1.534 లక్షల టన్నుల పసుపు, పసుపు ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. బంగ్లాదేశ్, యూఏఈ, యూఎస్‌ఏ, మలేషియా దేశాలు భారత్ నుంచి పసుపును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో 2030 నాటికి భారత్ నుంచి రూ. 8 వేల కోట్ల విలువైన పసుపును ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ క్రమంలో ఈ బోర్డు ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించింది.

బోర్డు ప్రధాన కేంద్రం ఎక్కడ?

అయితే బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. కేబినెట్ నిర్ణయాలపై కేంద్ర మంత్రులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ బోర్డును తెలంగాణరలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పినప్పటికీ.. ఏ ప్రాంతంలో, ఏ నగరంలో ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించగా.. ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కాకపోతే తెలంగాణలోనే ఏర్పాటవుతుందని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement