న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత బకాయిలు మొత్తం రూ. 1,702.90 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం – పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ సేకరించాల్సిందిగా కూడా కేంద్ర మంత్రిని కోరగా, ఆయన అంగీకరించారని తెలిపారు. రైతులకు వరి రవాణా ఛార్జీలు చెల్లిస్తున్న విధంగానే వరి ప్యాకింగ్ కు ఉపయోగించే గోనె సంచులను రైతులు ఏర్పాటు చేసుకుంటే వారికి వినియోగ ఛార్జీలు నేరుగా చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి అందేలా చేస్తోందని వెల్లడించారు. పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 2012-13 నుండి 2017-18 వరకు ఆరేళ్ల కాలంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.1,702.90 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరానని, వచ్చేవారం విడుదల చేస్తానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని తెలిపారు.
మారుతున్నకాలానికనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి దూరదృష్టితో స్మార్ట్ పీడీఎస్ క్రింద రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటుకు సంకల్పించారని, వాటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ పనులు వేగవంతంగా పూర్తిచేయడం కోసం కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు.