Tuesday, November 19, 2024

EV | ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం మరింత ప్రోత్సాహం

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘పీఎం ఇ-డ్రైవ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి రూ. 10,900 కోట్ల ($1.3 బిలియన్) మేర కేటాయించింది. ఈ పథకం రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.

పీఎం ఇ-డ్రైవ్ అంటే పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవెల్యూషన్ ఆన్ ఇన్నొవేటివ్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యం.

ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ

కేంద్రం ఎలక్ట్రిక్ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, అంబులెన్స్‌లు, ట్రక్స్, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీల కింద ₹ 3, 679 కోట్లు ($36.79 బిలియన్లు) కేటాయించింది. మొత్తంగా 28 లక్షల వాహనాల కొనుగోలుదారులకు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో 24.79 లక్షల టూ- వీలర్స్, 3.16 లక్షల త్రీ వీలర్ వాహనాలు, 14,028 బస్సులు ఉన్నాయి.

పబ్లిక్​ చార్జింగ్​ స్టేషన్ల ఏర్పాటు..

- Advertisement -

ఇ- అంబులెన్స్ ఏర్పాటుకు ₹ 500 కోట్లు, ఇ- ట్రక్స్ ప్రోత్సాహకానికి రూ. 500 కోట్లు, 14,028 ఇ- బస్సుల సేకరణకు రూ. 4391 కోట్లు అందిస్తారు. విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 2 వేల కోట్ల వరకు కేటాయించింది.

ప్రజా రవాణాలో ఈవీలు

ప్రజలు ఉపయోగించే ప్రజా రవాణాకు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను జోడించేందుకు రూ.4,391 కోట్లు అందజేస్తున్నారు. దీని ద్వారా దేశంలో 14,028 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న 4.2 లక్షల వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2% కంటే తక్కువగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

2030 నాటికి దీన్ని 30 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలను ప్రోత్సహించడానికి విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు (EV ఛార్జింగ్ స్టేషన్లు), నిర్మాణాలకు ఆర్థిక వనరులను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వాహన వ్యర్థాల నిర్వహణ

రోడ్లపై నుంచి కాలుష్య కారక వాహనాలను తొలగించేందుకు, కొత్త వాహనాల విక్రయాలను 18 నుంచి 20 శాతం పెంచేందుకు వాహన వ్యర్థాల కేంద్రాలను ఏర్పాటు చేయాలని వాహన తయారీదారులను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రోత్సహించారు. ఇందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement