న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ‘కేంద్ర-రాష్ట్ర సమన్వయ’ సంబంధిత అంశాలపై నేడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రపతి భవన్‌లోని కాన్ఫరెన్స్ గదిలో ఉదయం గం. 10.30కు కేబినెట్ సచివాలయంలోని సెక్రటరీ (కోఆర్డినేషన్) నేతృత్వంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. సమావేశంలో సవరించిన అజెండా ప్రకారం కేవలం పీఎంజీ పోర్టల్‌లో పొందుపర్చిన ప్రాజెక్టుల గురించి మాత్రమే చర్చ జరగుతుందని కేబినెట్ సెక్రటరియట్ స్పష్టం చేసింది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ, వాణిజ్య విభాగం, రక్షణశాఖలోని డీఆర్డీవో విభాగాల నుంచి అధికారులు హాజరుకావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్ర ప్రభుత్వంలోని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి, రైల్వే బోర్డ్ చైర్మన్, సీఈఓ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సహా పలు సంబంధిత శాఖల కార్యదర్శులకు కేబినెట్ సెక్రటరియట్ పంపించింది. అలాగే ఈ ఉత్తర్వుల కాపీని హోం సెక్రటరీ, వాణిజ్య విభాగం కార్యదర్శి, డీఆర్డీవో కార్యదర్శికి కూడా పంపించినట్టు పేర్కొంది. రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశానికి హాజరవుతారని తెలిపింది. బుధవారం నాటి సమావేశంలో పీఎంజీ పోర్టల్‌లోని ప్రగతి, నాన్-ప్రగతి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.