Sunday, November 3, 2024

Delhi | తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన లేదన్న కేంద్రం.. కాజీపేట కోసం పోరాడతాం: నామా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనేది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు బుధవారం ఆయన బదులిచ్చారు. కేంద్రమంత్రి సమాధానంపై నామ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం పునర్విభజన చట్టాన్ని సైతం తుంగలో తొక్కి చెప్పిన పదే పదే అదే మాట చెబుతోందని మండిపడ్డారు. విభజన హామీల అమలుపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేంద్రంపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని ఆక్షేపించారు. తెలంగాణ పట్ల కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందుభాగంగానే రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తిలోదకాలు ఇచ్చి, పునర్విభజన చట్టానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. కేంద్రం కక్షసాధింపులో భాగంగానే విభజన చట్టంలో పేర్కొన్న చాలా హామీలకు తిలోదకాలిస్తోందన్నారు. ఖాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హెూదా ఇలా అనేక హామీలను విస్మరించిందని నామ ఆరోపించారు.

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరాకరించడంతో ఉద్యోగవకాశాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువత నిరాశకు గురవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేంత వరకు అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటామని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement