Monday, November 25, 2024

Delhi | పప్పుదినుసుల సేకరణపై పరిమితి తొలగించిన కేంద్రం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో పప్పు దినుసుల సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కల్పించే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్ఎస్) కింద 2023-24 సంవత్సరానికి కందులు, మినుములు, మైసూరు పప్పును సేకరించాలని కేంద్ర  ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వీటి సేకరణపై ఉన్న గరిష్ట పరిమితిని తొలగించింది. ఈ మేరకు రాబోయే ఖరీఫ్, రబీ సీజన్లలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆహార కొరత, సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలని భావిస్తోంది. అయితే వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాల సాగు దేశంలో ఎక్కువగా జరుగుతున్నందున దేశీయ అవసరాలకు మించి దిగుబడి వస్తోంది. అదే సమయంలో నూనె గింజలు, పప్పు దినుసుల సాగు దేశీయ అవసరాలకు సరిపడా జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం, ఫలితంగా అంతర్జాతీయ డిమాండ్‌ను అనుసరించి ధరలు కూడా పెరగడంతో దేశీయ వినియోగదారులపై భారం పడుతోంది.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఎలాంటి పరిమితి లేకుండా ప్రభుత్వం పప్పు దినుసులను సేకరించడానికి వీలవుతుంది. తద్వారా రైతులు బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ వర్తకులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా కనీస మద్ధతు ధరకు ప్రభుత్వానికే అమ్ముకునే వెసులుబాటు కల్గుతుంది. గిట్టుబాటు ధర దొరుకుతుందని గ్రహిస్తే రైతులు ఈ పంటల సాగుకు ఆసక్తి చూపుతారు. పైగా రైతులు పప్పుదినుసుల సాగును పెంచేలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement