Friday, November 22, 2024

సీడీఎస్ నియామ‌కంపై కేంద్రం కొత్త రూల్స్‌.. కీల‌క నిర్ణ‌యాలు ఏంటంటే..

దేశానికి కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff) నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సీడీఎస్ నియామకానికి సంబంధించి పలు నిబంధనలలో మార్పులు చేసింది. త్రివిధ దళాలకు అత్యున్నత అధిపతిగా వ్యవహరించే సీడీఎస్ పోస్టుకు పదవీ విరమణ చేసిన త్రీ స్టార్ అధికారులు కూడా అర్హులు అని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రిటైర్డ్ అధికారులు సైతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకానికి అర్హులుగా కేంద్ర రక్షణశాఖ నిర్ణయం తీసుకుంది. సీడీఎఫ్ పదవికి లెఫ్టినెంట్ జనరల్, జనరల్ సమానమైన హోదా, లెఫ్టినెంట్ జనరల్ / జనరల్ సమానమైన ర్యాంకు హోదాలో ఉన్న అధికారులను కూడా ఎంపిక చేయనున్నారు.

రిటైర్డ్ అయిన అధికారుల వయసు 62 ఏళ్లకు మించకూడదని ఓ నిబంధన తీసుకొచ్చారు. ఇప్పటివరకూ ఆ పోస్టులో సేవలు అందించిన జనరల్ బిపిన్ రావత్ తరహాలో కొత్త సీడీఎస్‌ను ఆర్మీ నుంచి మాత్రమే తీసుకోవాలనే నిబంధనలో మార్పులు చేశారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ అత్యున్నత అధికారులు సైతం సీడీఎస్ పోస్టుకు అర్హులు అని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఎయిర్‌ఫోర్స్‌లో అత్యున్నత పదవులైన ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్ లేదా ఈ సమానమైన ర్యాంకులతో రిటైర్ అయిన అధికారులను ఈ సీడీఎస్ పదవిలో నియమించవచ్చు. నేవీ నుంచి చీఫ్ నావల్ స్టాఫ్, నేవీ చీఫ్ అడ్మిరల్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ లాంటి తొలి, రెండు ర్యాంకుల్లో విధులు నిర్వహించిన వారితో పాటు ఈ ర్యాంకుల్లో రిటైర్ అయిన వారు కూడా సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో తమ ఉన్నతాధికారిని దాటుకుని సైతం రెండో ర్యాంకులో కొనసాగుతున్న అధికారులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఇటీవల పదవీ విరమణ చేసిన ముగ్గురు సర్వీస్ చీఫ్‌లు సీడీఎస్‌గా నియమితులయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సీడీఎస్ పదవికి కటాఫ్ వయసు 62గా నిర్ణయించారు. 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన మాజీ కమాండర్-ఇన్-చీఫ్ ర్యాంక్ అధికారులకు సీడీఎస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్ స్టార్ అధికారులతో పాటు త్రీ స్టార్ అధికారులు, రిటైర్ అయిన వారిని సీడీఎస్‌గా నియమించాలని గత ఏడాది డిసెంబర్‌లో కేంద్రం యోచించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీడీఎస్ నియామకంపై ఈ మేరకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

కాగా, దేశ తొలి సీడీఎస్‌గా బాధ్యతలు నిర్వహించిన జనరల్ బిపిన్ రావత్ గత ఏడాది తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన సతీమణితో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణించిన ఆర్మీ ఉన్నతాధికారులు సైతం ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. గత డిసెంబర్ నుంచి కొత్త సీడీఎస్ నియామకంపై కసరత్తులు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement