Wednesday, November 20, 2024

Delhi | ఏపీ భవన్ విభజనకు కసరత్తు.. మార్చి 7న కీలక సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి భవన్ విభజనపై కీలక ముందడుగు పడింది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మార్చి 7న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి హాజరుకావాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యద్శులు, ఉన్నతాధికారులకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజనపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై తెలంగాణా ప్రభుత్వ తాజా ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఇండియా గేట్ సమీపంలో ఉమ్మడిగా సుమారు 20 ఎకరాల స్థలం ఉంది. రూ. 10 వేల కోట్లకు పైగా విలువైన ఈ ఉమ్మడి ఆస్తిలో ఎప్పుడో నిర్మించిన భవనాలతో పాటు ఖాళీ స్థలం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఈ ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది.

- Advertisement -

ఈ మేరకు మొత్తం 19.781 ఎకరాల్లో గోదావరి బ్లాక్ 4.315 ఎకరాలు, శబరి బ్లాక్‌కు అనుకొని వున్న దుకాణాలు మధ్య ఉన్న రహదారి 0.512 ఎకరాలు, నర్సింగ్ హాస్టల్‌ ఖాళీ స్థలం 3.359 ఎకరాలు, పటౌడి హౌజ్ లో 2.396 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. శబరి బ్లాక్ ఉన్న 3 ఎకరాలు, పటౌడి హౌజ్‌లో ఉన్న 5.245 ఎకరాలు తెలంగాణకు కేటాయించేలా పేర్కొంది. ఈ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకారం తెలుపుతూ.. దుకాణాలు, రహదారులున్న ప్రాంతాన్ని తొలగించడం కష్టం కాబట్టి అందుకు ప్రతిగా రూ. 250 కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన, పంపకం విషయంలో ఏకాభిప్రాయం కుదరడంతో కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది ఆమోదముద్ర వేయనుంది. పటౌడి హౌజ్‌లోని 5.245 ఎకరాల్లో నూతన తెలంగాణ భవన్ నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మార్చి 7 నాటి సమావేశంతో విభజన అంశం కొలిక్కి వచ్చిన వెంటనే కొత్త భవన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement