న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ల కవరేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చాలా అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 10 జిల్లాల్లో కవరేజీ దయనీయంగా 30 వేల కంటే తక్కువగా ఉందని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ-శ్రమ్ నమోదు లక్ష్యం 1.51 కోట్లు కాగా, ఇప్పటి వరకు 70.93 లక్షల కార్డులు మాత్రమే జారీ చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి వెల్లడించారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు గురువారం ఆయన జవాబిచ్చారు. ఈ-శ్రమ్ కార్డుదారులు ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు 2 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం పొందుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పథకం కింద 1.51 కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటివరకు కేవలం 70.92 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే నమోదు చేశారని కేంద్రమంత్రి చెప్పారు.
ఆయన సమాధానంపై ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ… ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతివ్వాలని, ఇది కేంద్ర పథకం కాబట్టి ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ పథకం కింద లబ్ధిదారుల నమోదుకు అవసరమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం లేదన్నారు. వివిధ జిల్లాల్లోని బీజేపీ శ్రేణులు అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించి వారికి ఈ-శ్రమ్ కార్డులు అందజేసేందుకు సహకరించారని జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. కార్మిక వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఉదాసీనతకు ఈ పథకమే నిదర్శనమన్నారు. సామాజిక భద్రత కోసం అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ లేబర్ కార్డులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కానుక అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.