న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రానికి విడుదల కావాల్సిన స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) నిధులు జాప్యమవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ విడుదల చేయడానికి అవసరమైన పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అందజేయలేదని తెలిపారు. ఈ పత్రాలు పంపిన వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నేరుగా కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితి గురించి ఆయనకు వివరించినట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసిన కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి విడత ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం ఇప్పటికే విడుదల చేసిందని గుర్తుచేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రెండో విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. వరదల్లో సహాయక కార్యక్రమాల కోసం కేంద్ర హోంశాఖ ఇప్పటికే 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుత గోదావరి వరదలు, ఆ కారణంగా జరిగిన నష్టంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రాథమిక నివేదిక అందిన వెంటనే కేంద్ర బృందాలను పంపి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.