ఉమ్మడి మెదక్, ప్రభన్యూస్ బ్యూరో: తెలంగాణ రైతుల కోసం బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆదాయంతో ఆ ప్రాజెక్టును నిర్మించగా, కేంద్రం 86 కోట్లు ఇచ్చినట్టు చెబుతోందని ఇవ్వాల (గురువారం) ఆయన లోక్‌సభలో కేంద్ర విధానాలను ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం చెప్పడం దారుణం అని మండిపడ్డారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నో సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారన్నారు. కానీ ఒక్క నయాపైసా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామని సభలో అబద్ధాలు చెప్పడం దారుణం. బీజేపీ సోషల్ మీడియాలో అబద్దాలు మాట్లాడినట్లు.. సభలో కూడా అబద్దాలు మాట్లాడిందని, అసలు రూ.86 వేల కోట్లు ఎప్పుడు ఇచ్చారో సమాధానం చెప్పాలని కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవ్వాల తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా చూస్తోందని లోక్ సభలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, అధికారులు తెలంగాణ అభివృద్ధిని పరిశీలిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసించి, ఆయా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. కేసీఆర్ గొప్పగా పరిపాలన చేస్తున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు అని, ఇంత గొప్ప ప్రాజెక్టు కడితే బీజేపీ ఏనాడూ సహాయం చేయలేదన్నారు.