- మోటార్లకు మీటర్లు సిగ్గుచేటు
కేంద్రంలోని బీజేపీ సర్కారు దుర్మార్గ సంస్కరణలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లుపై చర్చలో భాగంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి తెరాస ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రైతాంగం తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఎదుర్కొందని, వ్యవసాయ బావుల్లో సమృద్ధిగా నీరున్న కరెంటు లేక వాడుకోలేని పరిస్థితి ఉండేది అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు రంగానికి అందిస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో పారిశ్రామ రంగానికి విద్యుత్ సరఫరా చేయలేక పవర్ హాలిడేస్ విధించారని, తమ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తుందన్నారు. గతంలో కాకతీయ కాలువకు రైతాంగం మోటార్లు పెట్టుకొని వ్యవసాయానికి నీళ్లు తీసుకునేవారని అప్పట్లో వారి మోటార్లు వరద నీటిలో వేసిన సంఘటనలు కోకోల్లలు అన్నారు. కానీ తమ కేసీఆర్ కాకతీయ కెనాల్ తో పాటు వరద కాలువ వద్ద వ్యవసాయానికి రైతులు మోటార్లు పెట్టుకుంటే ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారన్నారు. రాష్ట్రంలో మానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలందిస్తుంటే, కేంద్రంలో దానవీయ ప్రధాని మోడీ తన దోస్తులకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రం దుర్మార్గపు పాలనను ప్రజలు తరిమికొట్టాలన్నారు. ప్రధాని స్వరాస్ట్రం గుజరాత్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని దళితులపై దాడులు జరుగుతున్నాయి అన్నారు.