Tuesday, November 26, 2024

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం భారీ పెట్టుబడులు.. ఆరు అణు విద్యుత్ రియాక్టర్లకు సూత్ర ప్రాయ ఆమోదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్నిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో ఒకొక్కటి 1208 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు రియాక్టర్లను ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొవ్వాడ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రభుత్వం ఖరారు చేసిన తర్వాత వాస్తవ పెట్టుబడి వివరాలు వెలువడతాయని మంత్రి చెప్పినప్పటికీ, కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం అంచనా పెట్టుబడులు 2 లక్షల కోట్ల వరకు ఉంటాయి.

కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పని ప్రారంభించిన తర్వాత, ప్రతి జంట యూనిట్ స్టేషన్లు దాదాపు 2 వేల మందికి ఉపాధి కల్పిస్తాయి. 6,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో 22 ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఉన్నాయని, 4,600 మెగావాట్ల సామర్థ్యంతో పదకొండు (11) న్యూక్లియర్ పవర్ రియాక్టర్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, పది 7,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రియాక్టర్లను ఫ్లీట్ మోడ్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిపాలనా విభాగం ఆమోదం తెలిపినట్టు కేంద్రమంత్రి తెలిపారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం 7,248 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అవుతుందని ఎంపీ జీవీఎల్ అన్నారు. ఇది దేశంలోని 22 ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో 6,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఎంపీ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement