Monday, November 25, 2024

Delhi | రాష్ట్రాలకు ఎస్​డీఆర్​ఎఫ్​ ఫండ్స్​.. 7,532 కోట్లు రిలీజ్​ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్న వేళ కేంద్రం 22 రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ (ఎస్డీఆర్ఎఫ్) విడుదల చేసింది. రూ. 7,532 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ. 493.60 కోట్లు విడుదల కాగా, తెలంగాణకు రూ. 188.80 కోట్లు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాలను సడలించి మరీ కేంద్ర హోంశాఖ సిఫార్సుల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

సాధారణ పరిస్థితుల్లో గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను రాష్ట్రాలు కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అవి పంపిన తర్వాతనే ఆయా రాష్ట్రాలకు ఈ ఆర్థిక సంవత్సరం కేటాయించిన నిధులను విడుదల చేస్తుంది. కానీ ప్రస్తుత వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా యుటిలైజేషన్ సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది.

2005 నాటి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 48 (1)(A) ప్రకారం ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు 90% నిధులను కేంద్రమే సమకూర్చుతుంది. ఇతర రాష్ట్రాలకు 75% నిధులను అందజేస్తుంది. మిగతా వాటా ఆయా రాష్ట్రాలు జోడించాల్సి ఉంటుంది. ప్రతి యేటా ఆయా రాష్ట్రాలకు నిర్దేశించిన మొత్తాన్ని రెండు విడతలుగా కేంద్రం విడుదల చేస్తుంది. ఈ నిధులను తుఫాన్లు, కరవు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, సునామీ, వడగళ్ల వానలు, కొండచరియలు విరిగిపడడం, అవలాంచి, క్లౌడ్ బరస్ట్, కోల్డ్ వేవ్, మిడతలు వంటి కీటకాల దాడి వంటి వైపరీత్యాల సమయంలో ఉపయోగించాల్సి ఉంటుంది.

ఆ రాష్ట్ర జనాభా, విస్తీర్ణం, గతంలో వైపరీత్యాల కోసం చేసిన ఖర్చు, ప్రకృతి పరంగా తరచుగా ఎదురయ్యే వైపరీత్యాలు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రాల వాటాను నిర్ణయిస్తారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2021-22 నుంచి 2025-26 వరకు రూ. 1,28,122.40 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ కింద గణించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 98,080.80 కోట్లు కాగా, మిగతాది రాష్ట్రాల వాటా. ఇందులో కేంద్రం ఇప్పటికే రూ. 34, 140 కోట్లు విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన మొత్తం కలిపితే రూ. 42,366 కోట్లకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement