సామాజిక మాధ్యమాలు, వీడియో ప్లాట్ ఫాంలపై అసత్య వార్తలు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. తాజాగా 22 యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో 18 భారత్‌కు చెందినవి కాగా మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున వీటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ వెల్లడించింది. అయితే, యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవడం ఇదేతొలిసారి కావడం విశేషం. భారత్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. న్యూస్ ఛానెళ్ల మాదిరిగా లోగోలు, థంబ్ నెయిల్‌లు వాడుతూ వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గ్రహించింది. వీటితోపాటు భారత భద్రతా దళాలు, జమ్మూకాశ్మీర్ అంశాలతోపాటు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
నిషేధం విధించిన ఈ యూ ట్యూబ్ ఛానెళ్ల మొత్తం వీక్షణల సంఖ్య 260 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, వీక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఆయా ఛానెళ్లు తమ కార్యక్రమాలను నడిపిస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ ఛానెళ్లు కూడా ఇదే విధంగా భారత్‌కు వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశ సమగ్రత, జాతీయ భద్రత విషయాల్లో ప్రజలను తప్పుదోవపట్టిస్తే ఊరుకునేది లేదని, ఆన్‌లైన్‌లో విశ్వసనీ యమైన, ప్రామాణిక వార్తల ప్రసారాలకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..