న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం 2.0కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 27 ఐటీ హార్డ్‌వేర్ తయారీ కంపెనీలకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకు తొలిదశలో ఈ పథకాన్ని అమలు చేయగా.. అది విజయవంతమైందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పుడు పీఎల్ఐ స్కీం 2.0లో భాగంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని సైతం ప్రోత్సహించాలని కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది మే 17న నిర్ణయించింది. ఈ పథకం కింద ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఆల్-ఇన్-వన్ పీసీలు, సర్వర్లు, అల్ట్రా స్మాల్ ఫాం ఫ్యాక్టర్ డివైజులను తయారుచేయడానికి వెసులుబాటు కల్గుతుంది. భారత్‌లో తయారు చేసే ఈ వస్తువులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తుంది.
ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న 27 ఐటీ హార్డ్‌వేర్ తయారీ కంపెనీలకు అనుమతి మంజూరు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. అనుమతి పొందిన కంపెనీల జాబితాలో బహుళజాతి సంస్థల బ్రాండ్లు ఏసర్, ఆసస్, డెల్, హెచ్పీ, లెనోవో తదితర సంస్థలున్నాయి. దీని కింద మొత్తం 2 లక్షల మందికి ఉపాధి (ప్రత్యక్షంగా 50 వేల ఉద్యోగాలు, పరోక్షంగా 1.5 లక్షల మందికి ఉపాధి) లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
అలాగే 42 బిలియన్ డాలర్ల మేర వస్తువుల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తోంది. హార్డ్‌వేర్ పరికరాల తయారీ కోసం రూ. 3 వేల కోట్ల మేర పెట్టుబడులు కూడా వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం గురించి మీడియా సమావేశంలో వివరించిన కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. 27 కంపెనీల్లో 23 కంపెనీలు మొదటి రోజు నుంచే ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.