న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వైద్య ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్స్ విధానాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద చేపట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. దేశంలో 75 శాతం వైద్య ఆరోగ్య సేవలు కేవలం పట్టణ ప్రాంతంలోనే కేంద్రీకృతమయ్యాయంటే దేశ జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించే 27 శాతం ప్రజలకే ఈ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి వైద్య సేవల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తున్నందున ఒకప్పటి ఫ్యామిలీ డాక్టర్స్ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వైద్య ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావచ్చని విజయసాయి అభిప్రాయపడ్డారు.
ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా సాధారణ వైద్య ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఈ విధానంతో గ్రామీణ ప్రాంతంలో అనేక జబ్బులకు సకాలంలో చికిత్స లభిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్స్ రోగులకు నేరుగా చికిత్స అందించడం లేదా మెరగైన చికిత్స కోసం స్పెషలిస్టు డాక్టర్లకు సిఫారసు చేస్తారని, ఫ్యామిలీ డాక్టర్ విధానం కింద గ్రామీణ ప్రాంతాల్లో వైద్య అవసరాలను ఆరంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో వైద్యం కోసం నకిలీ డాక్టర్లపై ఆధారపడే అవసరం తప్పుతుంది. నిక్కచ్చిగా జరిగే రోగ నిర్ధారణ పరీక్షల వలన ఆస్పత్రుల్లో చేరే అవసరం కూడా గణనీయంగా తగ్గుతుందని, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి, పని భారంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని ఎంపీ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి అందుకు ఉదాహరణగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుందని చెప్పారు. భారతీయులందరికీ వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి వైద్య ఆరోగ్య సేవలను విస్తరించాలని విజయసాయి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ ఆసుపత్రుల్లో మెడికోల నిర్బంధ సేవలు
ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఏ కేటగిరీలో సీట్లు పొందిన పోస్టు గ్రాడ్యుయేట్ మెడికోలు వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్బంధంగా వైద్య సేవలు అందించాలనే నిబంధన 2022-23 విద్యా సంవత్సరం నుంచి వర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి భారతీ పవార్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే సబ్ సెంటర్ స్థాయిలో కూడా వైద్యాధికారులు సేవలందించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ట్రయల్ రన్ కూడా ప్రారంభించిందని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రల్లో స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకునేందుకు సరళమైన నిబంధనలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్టింగ్ ఇన్, కాంట్రాక్టింగ్ అవుట్ పద్ధతిలో స్పెషలిస్ట్ సర్వీసులు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను ప్రభుత్వ సేవలకు వినియోగించుకోవడం వంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యులకు ఏరియా అలవెన్సులు, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు వసతి, రవాణా ఖర్చులు వంటి వాటిని ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకునే విధంగా వీలు కల్పించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. డాక్టర్లు, స్పెషలిస్టులను ఆకర్షించే విధంగా జీతభత్యాలు నిర్ణయించుకునే అధికారం కూడా రాష్ట్రాలకు ఇచ్చినట్లు వెల్లడించారు. అందులో భాగంగానే యువర్ కోట్, యువర్ పే విధానం ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్స్ రెసిడెన్సీ ప్రోగ్రాంను ఆమోదించిందని, ఇందులో భాగంగా పీజీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్నవిద్యార్థులు జిల్లా ఆసుపత్రుల్లో సేవలందించేందుకు మూడు నెలల పాటు నియమిస్తారని వివరించారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద ప్రతినెలా 9వ రోజున 2, 3 ట్రైమిస్టర్‌లోని గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయడం జరుగుతోందన్న కేంద్రమంత్రి, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.6 కోట్ల మంది గర్భిణీలకు యాంటీ నాటల్ వైద్య సేవలందించినట్లు తెలిపారు.
ఏపీలో 3 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత (సీఎస్‌ఎస్) కింద ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి భారతీ పవార్ తెలిపారు. ఈ మూడు కాలేజీల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు తెలిపారు. అలాగే రెండవ దశలో రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తూ కొత్త పీజీ కోర్సులు ప్రారంభించేందుకు 1040 పీజీ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా సీఎస్ఎస్ కింద మూడో దశల్లో దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. జాతీయ మెడికల్ కమిషన్ అందించిన సమాచారం ప్రకారం ఏపీలో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలతో సహా 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, ఇప్పటికే సీఎస్ఎస్ కింద మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీల లిస్టులో లేని కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్టు మంత్రి తెలిపారు. రూరల్ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో జిల్లా ఆసుపత్రులు, రిఫరల్ ఆసుపత్రులకు అనుసంధానంగా వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఆయుష్ ఔషధాల ప్రమాణాల నియంత్రణకు చర్యలు
ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు తయారైనట్లు సర్టిఫై చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో విజయసాయి రెడ్డి ఆయుష్ శాఖ మంత్రిని ప్రశ్నించారు. 2025 నాటికి ఆయుష్ ఔషధాల ఎగుమతులను 23 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆయుర్వేద ఔషధాలు ప్రభావశీలంగా, ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నియంత్రించి వాటిని సర్టిఫై చేసేందుకు ఎలాంటి పరిశోధనలు, అధ్యయనాలు జరుపుతున్నదో వివరించాలని కూడా ఆయన కోరారు. ఆయుష్ ఔషధాలను జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ సర్టిఫికెట్) నిర్దేశించిన ప్రమాణాల మేరకే తయారు చేయాల్సి ఉంటుందని ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్రబాయ్ జవాబిచ్చారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు బయో మెడికల్ ప్రాడక్ట్‌గా సర్టిఫికెట్ పొందాల్సి కూడా ఉంటుందని తెలిపారు. ఆయుర్వేద ఉత్పాదనలు ఆయుష్ ప్రీమియం మార్క్ పొందడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ సైతం అవసరం ఉంటుందని చెప్పారు. ఆయుష్ ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు థర్డ్ పార్టీ సర్వేల ద్వారా వాటి నాణ్యతను పరీక్షించడం జరుగుతుందని చెప్పారు.