తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా మంకీపాక్స్‌ను గుర్తించేందుకు 15 లాబొరేటరీలకు శిక్షణ ఇచ్చినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. వైరస్‌ను గుర్తించేందుకు ఈ లాబరేటరీల్లోని సిబ్బందికి పుణలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐ వీ) ఆధ్వర్యంలో పకడ్బందీ శిక్షణ నిచ్చినట్లు పేర్కొంది. మంకీపాక్స్ కేసు నిర్దారణ కాగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి మల్టిd డిసిప్లినరీ బృందాన్ని కేరళకు తరలించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసి), డాక్టర్ ఆర్ఎంఎల్ హాస్పిటల్‌కు చెందిన నిపుణులు, ఆరోగ్యమంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారితో పాటు కేరళలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంతీయ కార్యాలయం నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందం కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖతో కలిసి పని చేస్తుంది. ఆన్ గ్రౌండ్ పరిస్థితులను సమీక్షిస్తుంది. అవసరమైన ప్రజారోగ్య సూచనలను సిఫారసు చేస్తుంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఐదు జిల్లాలకు హెచ్చరిక..
భారత దేశంలో మొట్ట మొదటి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదైన ఒక రోజు తర్వాత రాష్ట్ర ఆరోగ్య శాఖ మొత్తం 14 జిల్లాలకు హెచ్చరిక జారి చేసింది. మంకీపాక్స్ కేసు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తం చేశామని ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. ”ఐదు జిల్లాల ప్రజలు – తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలపుజా, కొట్టాయం- యుఎఇ నుండి సోకిన వ్యక్తితో పాటు ప్రయాణించారు. దీంతో ఆయా జిల్లాల్లో ప్రత్యేక హెచ్చరికలు జారి చేశారు. వారి ఆరోగ్య స్థితి గురించి అప్డేట్లను పొందడానికి ఆరోగ్య కార్యకర్తలు ఈ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నారు. అవసరమైతే కోతులకు సంబంధించిన పరీక్షలు చేస్తారు. అన్ని జిల్లాల్లో
ఐసోలేషన్ యూనిట్లు సిద్దం చేయబడతాయి. అయితే భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు” అని మంత్రి చెప్పారు. 21 రోజుల్లోపు ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.