Tuesday, November 26, 2024

Delhi: వెనుకబడిన వర్గాల కులగణన చేయండి.. కేంద్రమంత్రికి బీసీ సంఘాల విజ్ఢప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా బీసీ కులాల గణన చేయాలని బీసీ సంఘాలు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అధ్వర్యంలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కులాల లెక్కింపు లేకపోవడం వల్ల బీసీలకు ఎంతో నష్టం జరుగుతోందని, వారు విద్యా, ఉపాధి, చట్ట సభల్లో సముచిత స్థానాన్ని కోల్పోతున్నారని కేంద్రమంత్రికి వివరించారు. బీసీ కుల గణన అనేది ప్రధానాంశంగా భావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే దేశవ్యాప్తంగా బీసీ కుల గణన జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు సూదగాని హరిశంకర్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగముర్తి పటేల్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ మీవల్లే సాధ్యం
మరోవైపు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూడా కేంద్ర మత్రి రాందాస్ అథవాలేను కలిశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో బీసీ నేతలు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీల కులగణన, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, బీసీ ఉద్యోగాలకు ప్రమోషన్లు, రిజర్వేషన్ల తదితర అంశాలపై వారు చర్చించారు. వైఎస్సార్సీపీ ఎంపీగా ఎన్నికైన జాతీయ బీసీ సంఘ నేత ఆర్. కృష్ణయ్య అన్ని పార్టీల బీసీ నాయకులను కలుపుకుని బీసీల డిమాండ్ల కోసం ముందుకెళ్తున్నారని కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement