Friday, November 22, 2024

పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లకు ప‌ర్మిష‌న్ లేదు.. టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా జరగాలి: మంత్రి సబితా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈమేరకు అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించకూడదని ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ, ఇతర అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా దాన్ని వెంటనే పరిష్కరించేందుకు వీలుగా పాఠశాల విద్యా డైరెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్‌ నెంబర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే విద్యార్థుల హాల్‌టికెట్లను ఆయా పాఠశాలలకు చేర్చడం జరిగిందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్‌ ప్రసారంలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాగునీటి వసతి, టాయ్‌లెట్‌ సౌకర్యం, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అవసరమైన మందులు, మెడికల్‌ సిబ్బందితో కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈనెల 23 నుంచి జూన్‌1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు బాగా రాయాలని మంత్రి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement