న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణా భవన్‌లో సోమవారం సంబురాలు జరిగాయి. ఏఈఎస్ ఐటీవో బ్రాంచులో జరిగిన ఉత్సవాలకు ఢిల్లీలోని వేంకటేశ్వర కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య షీలారెడ్డి, సొసైటీ అధ్యక్షులు డా. ఎమ్.ఆర్. మూర్తి, ఉపాధ్యక్షులు ఎస్.ఎ. ఆలీషా, కార్యదర్శి ఈశ్వరప్రసాద్, కోశాధికారి వి. ఛటర్జీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చిన మనిషని, ఆయన తన ఉపన్యాసాలలో వేదాంత తత్త్వశాస్త్రం గురించి ప్రస్తావించేవారని షీలారెడ్డి గుర్తు చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఆంధ్రా విద్యాసంస్థల సంఘం ఉత్తమ విద్యార్థి, ఉపాధ్యాయుల పురస్కారాలను ప్రకటించింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఏఈఎస్ పుష్పవిహార్, జనక్‌పురి, ప్రసాద్‌నగర్, ఆర్కే పురం పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌లోని బి.ఆర్.అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే ఉత్సవాలు జరిగాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.