విప్లవకర మేడే ను ఘనంగా జరపాలని మావోయిస్టు లు పిలుపునిచ్చారు. ఈ మేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖ పూర్తి పాఠ్యాంశం…. బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం తెచ్చిన నూతన నాలుగు కార్మిక కొడ్సుకు రైతాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పాలసీలకు వ్యతిరేకంగా కార్మికవర్గం, రైతాంగం రాజకీయ మిలిటెంట్ ఉద్యమాలను చేపట్టాలి. మేడే సందర్భంగా కార్మికవర్గానికి, భారతదేశ శ్రమజీవులకు, ప్రపంచ కార్మికవర్గానికి సిపిఐ (మావోయిస్టు) హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నది. అత్యంత వినాశకరమైన సంక్షోభం గుండా సాగుతున్న ప్రపంచ పెట్టుబడిదారీ విధానపు చారిత్రక మలుపులో మనం ఈ మేడే జరుపుకుంటున్నాము. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం పీడిత దేశాలలో శ్రమజీవులపై, పెట్టుబడిదారీ దేశాలలో కార్మికులపై తీవ్రమైన దమనకాండ, దోపిడి కొనసాగిస్తున్నది. సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు తీవ్రతరమౌతూ నూక్లియర్ యుద్ధం వైపు దారితీస్తున్నది. ప్రపంచ కార్మికవర్గం ఈ రోజు అదనపు విలువను సృష్టించే సప్లై చైను అనుబంధంగా మారిపోయింది. ఇది విశాల మానవ జీవిత ఉనికికి సంబంధించిన పార్శ్వాలను దిగజార్చడమే కాకుండా, దాన్ని లేకుండా చేస్తున్నది. మెజారిటీ ప్రజల మానవీయ విలువలను దెబ్బతీస్తున్న పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కార్మికవర్గం, ప్రజలు తప్పనిసరిగా తిరగబడేలా చేస్తున్నది. అర్ధ భూస్వామ్య, అర్ధ వలస లాంటి మనదేశంలో వివిధ రూపాలలో పెట్టుబడులు సహజీవనం చేయడంతో పాటు, కార్మికవర్గం వివిధ రకాలుగా ఉనికిలో ఉంది. పెట్టుబడిదారీ దేశాలలో లాగా మన దేశంలో సంపూర్ణమైన స్వేచ్ఛయుత శ్రమ లేదు. జీతం చెల్లించని గృహశ్రమ, అనుబంధ శ్రమ, క్యాజువల్ శ్రమ ద్వారా అదనపు విలువను దోపిడిచేసే విధానము అమలులో ఉంది. మోడీ అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. పై స్థాయిలో ఉన్న 100 బిలియనీర్లు దేశంలో దాదాపు 54 లక్షల కోట్లు కంట్రోల్ చేస్తున్నారు. ఆ మొత్తం కనీసం 18 నెలల కేంద్ర ప్రభుత్వ బడ్జెటుకు సరిపోతుంది. ఈ రకంగా సంపద, వనరులు దోపిడిదారుల చేతుల్లో కేంద్రీకరించబడడం అనేది, దేశ ఆర్థిక వ్యవస్థ, కార్మికవర్గ దుస్థితికి కారణమౌతున్నది.
వ్యవసాయ పరిస్థితులు: చిన్న, మధ్యతరగతి, అలాగే పెద్ద రైతులకు లాభసాటి వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లోని పాలకవర్గాలు పాలసీలను రూపొందించడంలో విఫలమౌతున్నాయి. ఈసారి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పరపతి కోసం 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. అప్పులు రద్దు చేయాలని, కనీస మద్దతు ధర, ఉత్పాదకాల ఖర్చులు తగ్గించడానికి వ్యవసాయ చట్టాలు అవసరమని కోరుతున్న రైతాంగాన్ని ఇది అపహాస్యమే చేయడమే తప్ప మరేమీ కాదు. చిన్న, మధ్య తరగతి రైతాంగం సృస్టిస్తున్న మిగులును భూస్వాములు, సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి దోచుకుంటున్నది. గత గణాంక వివరాల మేరకు, భూమిలేని రైతులు మొత్తం సంఖ్య 14 కోట్లు ఉండగా, ప్రస్తుత ధోరణి చూస్తే ఆ సంఖ్య మరింత పెరిగింది. దాదాపు 83 శాతం గ్రామీణ కుటుంబాలు 30 శాతం కంటే తక్కువ భూమి కలిగి ఉండడాన్ని చూస్తే భూమి నూతన భూస్వాముల, కార్పొరేట్ వర్గాల చేతిలో కేంద్రీకృతమైందనే విషయాన్ని తెలియజేస్తున్నది.
ఉద్యోగాల స్థితి, కార్మికవర్గం పై దాడి: మన దేశంలో శ్రమ శక్తిలో దాదాపు 90 శాతం అసంఘటిత రంగంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,665 సూక్ష్మ స్థాయి, చిన్న, మధ్య రకం పరిశ్రమలు మూసివేయబడినాయి. గత నాలుగు సంవత్సరాలలో ఇది అత్యధికం. ఆర్థిక రంగంలో 30 నుండి 40 శాతం గల అసంఘటిత శ్రామికశక్తి నోట్ల రద్దు, జిఎస్టీ, కోరోనా మహమ్మారి వలన కొట్టుమిట్టాడుతున్నది. సంఘటిత రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల వాటా తీవ్రంగా పడిపోతున్నది. 2014-2021 మధ్య 22 కోట్లకు పైగా ఉద్యోగ దరఖాస్తులు ఉండగా, మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో దాదాపు 7లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. ఇందులో దాదాపు 44 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు టెంపరరీ, కాంట్రాక్టుకు చెందినవి మాత్రమే. ఇదే కాలంలో మోడీ ప్రభుత్వం దూకుడుగా సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా అనుకూల పాలసీలను అమలు చేయడం వలన కోట్లాది మంది ఉద్యోగస్తులు, కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. భారత ఆర్థిక వ్యవస్థ అసంఘటితీకరణ వలన కార్మికవర్గం, రైతాంగం మరింత దోపిడీకి గురి అవుతున్నారు. కార్మికశక్తిని పెద్ద ఎత్తున కాంట్రాక్టీకరించడం వలన శీఘ్రంగా పడిపోతున్న జీతాల శాతం 1980 లో 30 శాతం నుండి 2009 లో 9.5శాతం కాగా, దీనితో పోలిస్తే ఇదే కాలంలో లాభాల శాతం 15 శాతం నుండి 55 శాతం పెరుగుదల ఉంది. సంఘటిత రంగ పరిశ్రమలలో 1991 లో దాదాపు 12.26 శాతం కాగా 2013-14 లో 42.27 శాతానికి పెరిగింది. గత కొద్ది సంవత్సరాలలో శ్రమలో పాల్గొనే రేటు 42.9 శాతం నుండి 39.8 శాతానికి తగ్గింది. 2016-17 నుండి 2021-2022 మధ్య సిమెంట్ పరిశ్రమలో 62 శాతం తగ్గుదల, లోహ పరిశ్రమలో 10 శాతం తగ్గుదల, గనుల పరిశ్రమలో 28 శాతం తగ్గుదల ఉంది. నిజ వేతనాలు పడిపోవడంతో కార్మికవర్గం కొనుగోలు శక్తి పడిపోతున్నది. 2021 NCRB రిపోర్టు ప్రకారం, ఈ రెండు సంవత్సరాలలో దాదాపు 80 వేల మంది వేతన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి ఇవి ఆత్మహత్యలు కావు, పాలకవర్గాలు చేసిన హత్యలు మాత్రమే.
ప్రభుత్వ కీలక రంగ పరిశ్రమల ప్రయివేటీకరణ: భారత దేశ గుండెకాయలాంటి కీలక ప్రభుత్వ రంగాలను 2014 లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ప్రైవేటుపరం చేస్తూ వస్తున్నది. కోల్ ఇండియా లిమిటెడు కంపెనీని, సింగరేణినీ ఆదానీ, అంబానీ చేతిలో పెట్టడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నది. అందులో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు బొగ్గును తవ్వడం, తామే రేట్లు నిర్ణయించి అమ్మకాలు చేసేలా కోల్ మైన్స్(స్పెషల్)ప్రొవిజన్ ఆక్ట్ 2015 అనే చట్టాన్ని తెచ్చింది. నేషనల్ మానిటైజేషన్ కార్యక్రమం కింద మోడీ ప్రభుత్వం 400 రైల్వే స్టేషన్లను, 150 ప్రయాణికుల రైళ్లను, 2,843 కి.మీ సరుకు రవాణా కారిడార్లను, రైల్వే లైన్ల అవస్థాపనను, మరికొన్నింటిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులను, బీమా రంగాలను, టెలికాం రంగాలను ప్రైవేటీకరించాలని చూస్తున్నది. దేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి తీవ్రమైన పోలీస్ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.
అంతర్జాతీయ కార్మిక వర్గ పోరాటాలు : ఫ్రాన్స్ లో పెన్షన్లు, ఇతర సమస్యలపై జరుగుతున్న కార్మికవర్గ పోరాటాలు ఫ్రాన్స్ బూర్జువా ప్రజాస్వామ్యంలో ఉన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని తెలియజేస్తున్నాయి. తీవ్ర నిర్బంధంతో మేక్రాన్ ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నది. మార్చ్ 23 నాడు ఫ్రెంచ్ కార్మిక వర్గము సమరశీల పోరాటాలకు దిగడంతో, ప్రభుత్వం బెదిరిపోయి ఈ పోరాటం ప్రభుత్వాన్ని కూలదోయడానికి జరిగిందని ప్రచారం చేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని రక్షించడానికి రివిజనిస్ట్ పార్టీలు ప్రభుత్వంతో భుజం భుజం కలుపుతున్నాయి. అవి కార్మికవర్గ పోరాటాలను చెదరకొట్టడానికి రాజీ ఎత్తుగడలు అవలంభిస్తున్నాయి. ఫ్రాన్స్ లో సోషలిజం నిర్మించడానికి నిజమైన కమ్యూనిస్టు, విప్లవశక్తులు సైద్ధాంతిక, రాజకీయ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత స్థితిలో ఫ్రెంచ్ కార్మికవర్గం ప్రభుత్వం మెడలు వంచడానికి వెంటనే జనరల్ సమ్మె చేపట్టాల్సిన అవసరముంది. బ్రిటన్ లో మే 2022 నుండి వరుసగా కార్మికవర్గ నిరసనలు చెలరేగడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అమెరికాలో నర్సులు, అమెజాన్, ఇతర కార్మికవర్గ పోరాటాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థలో లోతైన సంక్షోభం నుండి వర్గ వైరుధ్యాలు పెరిగాయనడానికి ఇవి నిదర్శంగా నిలుస్తున్నాయి. భారత దేశంలో ట్రేడ్ యూనియన్లు కార్మిక వర్గ పోరాటాల వైపు నిలిచే కంటే ఈ వ్యవస్థతో సర్దుబాటు చేసుకొంటున్నాయి. రాజకీయ లక్ష్యంలో భాగంగా ట్రేడ్ యూనియన్లు కార్మిక పోరాటాలను ఒక్క అడుగు ముందుకు కూడా నడిపించడం లేదు. ట్రేడ్ యూనియన్లు పెట్టె పాక్షిక డిమాండ్లలో ఇరుక్కొని కార్మికవర్గం స్పాంటేనియస్ చైతన్యాన్ని మాత్రమే కలిగి ఉంటున్నారు. సమ్మెలు సంవత్సరానికి ఒకసారి జరిగే జాతరలాగా మారి శక్తిహీనంగా తయారై, కార్మికవర్గ స్తితిగతుల్లో కనీస మార్పు కనపడడం లేదు. కేంద్ర ట్రేడ్ యూనియన్లు 1991-2022 మధ్య 21 సార్లు సమ్మెలకు పిలుపునిచ్చాయి. కానీ ఇవేవీ ప్రభుత్వం పై ప్రభావాన్ని వేయలేక పోయాయి. పెట్టుబడి, ప్రభుత్వ కేంద్రీకృత శక్తి, ట్రేడ్ యూనియన్ల విద్రోహం ముందు కార్మికవర్గం చీలికలకు గురై ఉంది. భారతదేశంలో, ప్రపంచమంతటా ట్రేడ్ యూనియన్లు రివిజనిస్టుల, సోషల్ డెమొక్రాట్ల ప్రభావంలో ఉండి, కార్మికవర్గ పోరాటాలు ఆర్థికవాదం, సంస్కరణవాద ఊబిలో దిగిపోయాయి. భారత కార్మిక నేడు చరిత్రలో అత్యంత కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నది. అది సరియైన రాజకీయ దృక్పధంతో రైతాంగంతో, శ్రమజీవులతో కలిసి పోరాడడం ద్వారానే తనలో కొనసాగుతున్న బలహీనతలను అధిగమించగలుగుతుంది. సైద్ధాంతిక పోరాటాన్ని చేపట్టి, రాజకీయ అధికారాన్ని సాధించే లక్ష్యంతో మిలిటెంట్ కార్మికోద్యమాన్ని నిర్మించడం, నేడు కార్మికవర్గం మహత్తర కర్తవ్యంగా ఉండాలి.
కామ్రేడ్స్.. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఉత్పత్తి సంబంధాలు, సామాజిక ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి బంధనాలుగా ఉన్నాయి. వెనుకబడి ఉన్న భారతదేశ ఉత్పత్తి సంబంధాలు సామ్రాజ్యవాద గుత్తపెట్టుబడి, దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్యముతో ముడిబడి ఉండి, కార్మికవర్గ, ప్రజల అభివృద్ధికి అవరోధంగా ఉన్నాయి. ఈ బంధనాలను తెంచడానికి భారత కార్మికవర్గం రైతాంగంతో ఐక్యమై నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి సోషలిస్ట్ విప్లవంవైపు పురోగమించాలి. దేశవ్యాప్తంగా నూతన నాలుగు కార్మిక కొడ్సుకు, రైతాంగ వ్యతిరేక చట్టాలకు, బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య మిలిటెంట్ కార్మికవర్గ, రైతాంగ ఉద్యమాలను నిర్మించవలసిందిగా అన్ని ప్రజాసంఘాలకు, కార్మికులకు, రైతాంగానికి, మేధావులకు, విద్యార్థులకు, మహిళలకు, దళితులకు, అణిచివేయబడుతున్న ప్రజలకు, జాతుల పోరాట సంస్థలకు సిపిఐ(మావోయిస్టు) పిలుపునిస్తున్నది.