న్యూఢిల్లి : ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్రతో పాటు సహచర కమిషనర్లతో ప్రధాని కార్యాలయం అనధికారిక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. కీలక ఎన్నికల సంస్కరణల అవగాహనకు సంబంధించి ఈసీ, న్యాయశాఖ, ఎన్నికల సంఘం మధ్య అంతరాన్ని తగ్గించేందుకే ఈ భేటీ జరిగినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల చట్టాలు, ఇతర కీలక సమస్యలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం చాలా కాలంగా ఒత్తిడి చేస్తోందని, నవంబర్‌లో జరిగిన వర్చువల్ భేటీలో దీనిపై చర్చ జరిగినట్టు సమాచారం.
ప్రధాని కార్యాలయమే.. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం కథనాలు ప్రచురితం అయ్యాయి. కామన్ ఎలక్టోరల్ రోల్‌పై ప్రధాని ముఖ్య కార్యదర్శి నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఎన్నికల సంఘానికి న్యాయశాఖ లేఖ పంపినట్టు తెలుస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ భేటీలో పాల్గొనాలని లేఖలో పేర్కొంది. అధికారిక సమావేశానికి ముగ్గురు కమిషనర్లు హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారిక భేటీకి ఎన్నికల అధికారులు, న్యాయ శాఖ అధికారులు హాజరైనట్టు తెలుస్తోంది. పీఎంఓతో భేటీ ఆశ్చర్యంగా ఉందని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి అన్నారు. ఈసీ స్వతంత్ర రాజ్యాంగ సంస్థ.. ఇలాంటి భేటీలు రాజ్యాంగానికి విరుద్ధం.
కాంగ్రెస్ నేతల ఆగ్రహం
సీఈసీతో పీఎంఓ సమావేశం నిర్వహించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కూడా కేంద్ర ప్రభుతం దెబ్బతీస్తోందని మండిపడింది. రాజ్యాంగ సంస్థలను నాశనం చేయడంలో ప్రభుత్వం రోజురోజుకూ దిగజారుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. ఉమ్మడి ఎలక్ట్రోరల్స్ రోల్స్‌పై ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా నిర్వహించే సమావేశానికి సీఈసీతో పాటు మిగిలిన ఇద్దరు కమిషనర్లు కూడా హాజరుకావాలని న్యాయశాఖ అధికారులు సందేశం పంపడం ఏంటని ప్రశ్నించారు. సతంత్ర భారత చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ వినలేదని తెలిపారు.