Monday, November 25, 2024

నేడు కవిత ఇంటికి సీబీఐ.. మనీష్‌ సిసోడియా కేసులో వాంగ్మూలం సేకరించనున్న అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి మనీష్‌ సిసోడియా కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాంగ్మూలం ఆదివారం సీబీఐ తీసుకోనుంది. ఈనెల 11న తాను అందుబాటులో ఉంటానంటూ కవిత ప్రకటించిన నేపథ్యంలో.. సీబీఐ అధికారులు ఆమె ఇంటికి ఇవ్వాల (ఆదివారం) ఉదయం 11గంటలకు రానున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటి దగ్గర కొన్ని పోస్టర్లు వెలిశాయి. వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు అనే క్యాప్షన్‌తో బ్యానర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతకుముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, మరికొందరిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని సీబీఐకి కవిత లేఖ రాశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆమె ఢిల్లీ సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వస్తాకు ఈ లేఖ పంపారు. ఈ కేసులో కంప్లంట్‌ కాపీ, ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వాలన్న తన విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఈ-మెయిల్‌ అందిందని కవిత తెలిపారు.

- Advertisement -

అయితే సీబీఐ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని క్షుణ్ణంగా పరిశీలించానని, అందులో పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు ఎక్కడా లేదని అన్నారు. తనకు సీఆర్పీసీ 160 కింద సీబీఐ పంపిన నోటీసులకు ఈ నెల ఆరో తేదీన తన నివాసంలో అందుబాటులో ఉంటానని ముందు వెల్లడించానని, అయితే.. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఆరో తేదీన తాను సీబీఐ అధికారులను కలవలేకపోతున్నానని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒకరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటు-లో ఉంటానని సీబీఐకి లేఖలో తెలియజేశారు. పైన పేర్కొన్న తేదీల్లో సీబీఐ అధికారులకు అనువైన ఏదో ఒకరోజు సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇందుకు ప్రతిగా 11వ తేదీన కలుసుకునేందుకు సీబీఐ సమ్మతి తెలిపింది.

ఏం జరగబోతోంది?

కవిత వివరణను సీబీఐ అధికారులు తీసుకోనున్న నేపథ్యంలో సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు కవిత ఏ విధమైన సమాధానం ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కవిత స్టేట్‌మెంట్‌ ఆధారంగా సీబీఐ అధికారుల నెక్స్ట్‌ స్టెప్‌ ఉంటుందనే వాదనలు వస్తున్నాయి. ఇప్పటికే కవిత న్యాయనిపుణులతో ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలనే అంశంపై చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement