Saturday, November 23, 2024

ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్‌ స్కాం, స్టాక్‌ బ్రోకర్స్‌ కార్యాలయాల్లో సీబీఐ మెరుపు దాడులు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో కో-లొకేషన్‌ కుంభకోణం కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఎస్‌ఈ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిత్ర రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఢిల్లిd హైకోర్టు కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నోటీసులను అందుకున్న మరుసటి రోజే.. సీబీఐ అధికారులు.. దేశ వ్యాప్తంగా పలు చోట్ల విస్తృతంగా దాడులు చేయడం జరిగింది. దీంతో కో లొకేషన్‌ కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం పలు నగరాల్లో దాడులు చేపట్టింది. స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్ల నివాసాలు, కార్యలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది. దేశ రాజధానితో పాటు ముంబై, కోల్‌కతా, గాంధీనగర్‌, నొయిడా, గుర్‌గావ్‌లలో స్టాక్‌ మార్కెట్ల బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాలను తనిఖీలు చేపట్టింది. ఏక కాలంలో ఈ దాడులు చేయడం కలకలం సృష్టించింది.

రాత్రి వరకు కొనసాగిన సోదాలు

ఆయా స్టాక్‌ బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఉదయం ప్రారంభమైన తనిఖీలు కొన్ని చోట్ల మధ్యాహ్నం వరకు కొనసాగగా.. మరికొన్ని చోట్ల సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. విచారణ సందర్భంగా చిత్ర రామకృష్ణ పలు కీలక విషయాలు ఇప్పటికే వెల్లడించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకే ఈ దాడులు చేపట్టినట్టు చెబుతున్నారు. దీనిపై సీబీఐ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సీబీఐ కస్టడిలోనే చిత్ర

ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్‌ కుంభకోణం వ్యవహారంలో చిత్ర రామకృష్ణ ఇది వరకే అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆమె సీబీఐ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ కుంభకోణం విషయంలో ఆమె విచారణను ఎదుర్కొంటున్నారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ.. ఇది వరకు సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో.. బెయిల్‌ కల్పించాలంటూ.. విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం తోసిపుచ్చింది. విచారణ కొనసాగుతున్న సమయంలో.. బెయిల్‌ ఇవ్వలేమని సీబీఐ న్యాయ స్థానం స్పష్టం చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీని తరువాత చిత్ర రామకృష్ణ ఢిల్లిd హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ న్యాయ స్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఢిల్లిd హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. చిత్ర రామకృష్ణ బెయిల్‌ విషయంలో తన అభిప్రాయాలు తెలియజేయాలంటూ సూచించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement