Sunday, November 17, 2024

శ్రీ ల‌క్ష్మిని విచారించాల్సిందే – సుప్రీంలో సిబిఐ అభ్య‌ర్ధ‌న‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ప్రయేయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మళ్ళీ విచారణ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి చిక్కులు మొదలయ్యాయి. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించినప్పటికీ సుప్రీం కోర్టులో ఆమె భవిష్యత్‌ తేలనుంది. తాజాగా ఆమెపై ఉన్న కేసులపై సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. దీంతో కేసుల వ్యవ హారం మరోసారి సీరియస్‌ అయ్యింది. ఏపీకి నూతన గవర్నర్‌గా నజీర్‌ రావటం, ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోక ముందే యూనివర్శిటీ- వీసీల నియామకం, జాతీయ విద్యా విధానంపై కేంద్రం నివేదిక కోరింది. ఈ పరిణామాలు సీఎం జగన్‌కు ప్రతికూలంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ వేయటం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఓబులాపురం మైనింగ్‌ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగించిన తెలంగాణ హైకోర్టు అభిప్రాయాన్ని కాదని, ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఉందంటూ సుప్రీంలో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దాదాపు పదేళ్ళు గడిచినప్పటికీ జగన్‌ అక్రమాస్తుల కేసు ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిని వెంటాడుతూనే ఉంది. ఈ కేసు నుంచి ఆమెను వదిలిపెట్టకూడదని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఓబులాపురం ఐరన్‌ఓర్‌ కంపెనీకి సంబంధించి గనుల కేటాయింపు విషయంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసులో ఆమెను మళ్ళీ విచారించాల్సిందేనని స్పష్టంగా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement