Friday, November 22, 2024

సీబీఐ – బీజేపీ చేతిలో కీలుబొమ్మ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కారు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఎట్టిపరిస్థితుల్లో అప్పగించవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)  చేతి నుంచి కేసును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసులో సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ అరవింద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. కేసులో పిటిషనర్‌గా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తెలంగాణ ప్రభుత్వం) తరఫున ప్రముఖ్య న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేతిలో సీబీఐ కీలు బొమ్మ అని, ఆ సంస్థకు విచారణ అప్పగిస్తే కేసులో సాక్ష్యాధారాలన్నీ మాయమవుతాయని అన్నారు.

సీబీఐను బంధించిన చిలుకతో పోల్చుతూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. బీజేపీయేత రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని, తెలంగాణలోనూ అదే ప్రయత్నం చేసిందని, ఆ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసిందని దవే వివరించారు. ఈ కేసులో బీజేపీ నేతలు నిందితులుగా ఉన్నారని, అలాంటప్పుడు ఆ పార్టీ చెప్పుచేతల్లో పనిచేస్తున్న సీబీఐకి కేసును ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ ఒకసారి సమర్థించి, మరోసారి వ్యతిరేకించిందని గుర్తుచేశారు. సిట్ దర్యాప్తు జరుగుతుండగానే బీజేపీ నేతలు పిటిషన్ వేశారని, నేరారోపణ ఎదుర్కొంటున్న బీజేపీ నేతలే తమకు అనుకూలంగా ఉండే దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని కోరారని దుష్యంత్ దవే అన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ‘సిట్’ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పుచేతల్లో ఉంటుంది కదా అన్నారు. దీనికి బదులిస్తూ.. నేరం జరిగిన ప్రాంతం రాష్ట్ర పోలీసుల పరిధిలో ఉందని, ఈ క్రమంలో ‘సిట్’కు దర్యాప్తు జరిపే హక్కుందని అన్నారు. సిట్ దర్యాప్తుపై కోర్టు పర్యవేక్షణ ఉండేలా ఆదేశాలు జారీ చేయవచ్చని సూచించారు. జస్టిస్ బీఆర్ గవై జోక్యం చేసుకుంటూ.. సీబీఐ దర్యాప్తుపై కోర్టు పర్యవేక్షణ ఉండేలా ఆదేశాలిస్తామని అన్నారు. ఇందుకు ససేమిరా అన్న దవే, కేసు సీబీఐకి చేతికి వెళ్తే నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసును సీబీఐకి అప్పగించడానికి గల కారణాలను హైకోర్టు తన తీర్పులో పేర్కొంది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులతో కూడిన ఆధారాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మీడియాకు, న్యాయమూర్తులకు పంపించడాన్ని తప్పుబడుతూ ప్రస్తావించారు.

ఆయన సాధారణ వ్యక్తి కాదని, బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ఎలా చేస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులకు కల్గిన అసౌకర్యానికి క్షమించాలని కోరుతూ బదులిచ్చిన దవే.. తప్పుడు పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూసిందని, ముఖ్యమంత్రి నిర్వహించిన మీడియా సమావేశంతో దర్యాప్తు ఎలా ప్రభావితం అవుతుందని ప్రశ్నించారు. దర్యాప్తులో సీఎం జోక్యం ఎక్కడుందని అన్నారు. చేసే ఆరోపణలను నిరూపించే ఆధారాలుండాలని, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ నేతలను ఎవరూ ఆహ్వానించి ట్రాప్ చేయలేదని చెప్పారు. తమంతట తామే వచ్చి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని, మంతనాలు జరిగిన ఫాం హౌజ్ నుంచే బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన బీఎల్ సంతోష్‌కు మెసేజ్ చేశారని దవే చెప్పారు. ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేసిన కెమేరాల్లో రికార్డ్ అయ్యాయని తెలిపారు.

వాదనలు ఈ దశలో ఉండగా కోర్టు సమయం ముగిసిపోవడంతో ధర్మాసనం విచారణను మరో తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించింది. అయితే శనివారం నుంచి హోలీ సెలవులు ఉన్న నేపథ్యంలో శుక్రవారమే విచారణ చేపట్టాలని దుష్యంత్ దవే కోరారు. శుక్రవారం విచారణ సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ తేదీని ఖరారు చేసే విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో ఈ విషయం ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని జస్టిస్ గవై అన్నారు. దీంతో కేసును వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తారా లేక మరో బెంచ్‌ను నిర్ణయిస్తారా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement