ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నరేశ్ కుమార్ సిఫార్సు మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఎల్‌జీ నిర్ణయించారు. 1000 లోఫ్లోర్ బస్సుల కొనుగోలు అంశంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ జులైలో ఎల్‌జీకి ఫిర్యాదు అందింది. కొత్త బస్సుల కొనుగోలు, వాటినిర్వహణ టెండర్లకు సంబంధించిన కమిటీకి రవాణాశాఖ మంత్రిని చైర్మన్‌గా నియమించడంపైనా ఫిర్యాదులో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఫిర్యాదును పరిశీలించాలంటూ సీఎస్‌ను కోరగా, దీనిపై ఆగస్టులో ఆయన నివేదిక సమర్పించారు. టెండర్ల ప్రక్రియలో తీవ్ర వైరుధ్యాలను నివేదికలో సీఎస్ పొందుపరిచారు. సీవీసీ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక ఉల్లంఘన జరిగినట్లు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియలో వ్యత్యాసాలను దాచిపెట్టేందుకే డీఐఎంటీఎస్‌ను ఉద్దేశపూర్వకంగానే కన్సల్టెంట్‌గా చేసినట్లు తెలిపారు.
ఈ నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదును సీబీఐకి పంపారని అధికారవర్గాలు వెల్లడించాయి. కాగా, ఎల్‌జీ నిర్ణయాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆప్ సర్కార్ విమర్శించింది. ముందుగా ఎల్‌జీ తనపై వచ్చిన అవినీతి అభియోగాల నుంచి సచ్చీలుడుగా బయటపడాలని డిమాండ్ చేసింది. బస్సులను కొనుగోలు చేయలేదని, ఆ టెండర్లు రద్దయ్యాయని తెలిపింది. ఢిల్లిdకి మరింత విద్యావంతులైన ఎల్‌జీ అవసరం. ఇప్పటికే ముగ్గురు మంత్రులపై తప్పుడు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు నాలుగో మంత్రిపై ఎల్‌జీ ఫిర్యాదు చేశారని ఢిల్లిd ప్రభుత్వం పేర్కొంది.