Tuesday, November 26, 2024

Delhi | మనీశ్ సిసోడియాపై సీబీఐ చార్జిషీటు.. నిందితుల్లో కవిత ఆడిటర్ బుచ్చిబాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం నలుగురిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒక చార్జిషీట్‌ దాఖలు చేయగా, దానికి అనుబంధంగా మంగళవారం దాఖలు చేసిన చార్జిషీటులో సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును, మరో ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చింది. మొత్తం 209 పేజీలతో దాఖలు చేసిన ఈ చార్జిషీటుతో కేసు ముగిసిపోలేదని, మరికొందరి పాత్రపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని కోర్టుకు సీబీఐ చెప్పినట్టుగా తెలిసింది.

మంగళవారం మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న స్పెషల్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ, మనీశ్ సిసోడియా, గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ దల్‌ను నిందితులుగా పేర్కొంటూ ఐపీసీ సెక్షన్ 120(బీ), 201, 420తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7(ఏ), 8, 13 ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. అలాగే నాటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు మరో నలుగురిని అనుమానితులుగా పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను విచారణకు పిలిచిన సీబీఐ, అనంతరం అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి అమలు చేయడం వరకు జరిగిన అక్రమాలు, అవకతవకల్లో సిసోడియానే ప్రధాన కుట్రదారుడని సీబీఐ ఆరోపిస్తోంది.

ఇదే కేసులో మనీలాండరింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అభియోగాలు మోపినవారిలో ఆడిటర్ బుచ్చిబాబు ముందే బెయిల్ తీసుకోవడంతో ఆయన బయటే ఉన్నారు. అర్జున్ పాండేను అరెస్టు చేయాల్సి ఉందని స్పెషల్ కోర్టుకు సీబీఐ తెలియజేసింది. తాము సేకరించిన డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన వెంటనే వాటిని కోర్టుకు సమర్పిస్తామని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ చార్జిషీటును పరిగణలోకి తీసుకునే విషయంపై మే 12న విచారణ చేపడతామని స్పెషల్ కోర్టు తెలిపింది.

- Advertisement -

ఇంకా మిగిలే ఉంది

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటి వరకు మొత్తం 11 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిని నిందితులుగా పేర్కొన్న సీబీఐ, గత ఏడాది నవంబర్ 25న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో విజయ్ నాయర్‌తో పాటు మరో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపింది. తాజాగా మంగళవారం దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో మనీశ్ సిసోడియాతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంది. దీంతో కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ 11 మందిలో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేయగా, వారిలో మనీశ్ సిసోడియా మినహా మిగతా అందరూ బెయిల్‌పై విడుదలయ్యారు. కొందరు అరెస్టు కాకముందే బెయిల్ తీసుకున్నారు. అర్జున్ పాండేను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని సీబీఐ తెలియజేసింది. అయితే కేసు ఇంతటితో ముగిసిపోలేదు.

ఇదే కేసులో తాజాగా సీబీఐ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచి ప్రశ్నించింది. అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే ప్రశ్నించిన సీబీఐ, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. వీరిద్దరితో పాటు కేసుతో సంబంధం ఉన్న పలువురు సాక్షులు, అనుమానితులను ప్రశ్నించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసుకుంది. అయితే  అనుబంధ చార్జిషీటుతో కథ ముగిసిపోలేదని, ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించడంతో ఈ దర్యాప్తు ఎంతవరకు ముందుకెళ్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ ప్రభుత్వంలో నాడు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా పనిచేసిన అరవ గోపీకృష్ణ, కార్యదర్శిగా పనిచేసిన సి. అరవింద్ వాంగ్మూలాల ప్రకారం ఎక్సైజ్ పాలసీ రూపకల్పనతో పాటు కొందరికి మాత్రమే ప్రయోజనం కల్పించేలా అందులో మార్పులు చేర్పులు చేయడంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందని తెలిసింది.

ముఖ్యంగా డీలర్ కమిషన్‌ను ఏకంగా 12%  వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సీఎం కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలోనే తీసుకున్నారని సమాచారం. ఇక కేసుతో సంబంధం ఉన్న పలువురు కొద్ది నెలల వ్యవధిలోనే తమ సెల్‌ఫోన్లను ధ్వంసం చేయడం లేదంటే మార్చడం చేశారని సీబీఐ గతంలో దాఖలు చేసిన చార్జిషీటులోనే పేర్కొంది. ఆ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ప్రస్తావించింది. అయితే తాను సెల్‌ఫోన్లను ధ్వంసం చేయలేదని, వాటిని తన పనివాళ్లకు ఇచ్చానని చెబుతూ మొత్తం 10 సెల్‌ఫోన్లను ఆమె మరో దర్యాప్తు సంస్థ ఈడీకి అందజేశారు. ఈ పరిస్థితుల్లో సీబీఐ తదుపరి దర్యాప్తు ముందుకు సాగితే అటు కేజ్రీవాల్, ఇటు కవితకు ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement