హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)పైనా, ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన 8 మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎన్‌ఐఎస్‌పీ ప్రాజెక్ట్ అమలులో 315 కోట్ల మేర అవినీతి జరిగిందని సీబీఐ పేర్కొంది. కేసు బుక్ చేసిన అధికారుల్లో ఎన్‌ఎండీసీ, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఉన్నారు.
ఇటీవల ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం మేఘా ఇంజినీరింగ్ సంస్థ 966 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మేఘా ఇంజినీరంగ్ వీటిని కొనుగోలు చేసిన రెండో అతి పెద్ద సంస్థగా ఉంది. ఇందులో బీజేపీకి అత్యధికంగా 586 కోట్లు వెళ్లాయి. బీఆర్‌ఎస్‌కు 195 కోట్లు, డీఎంకేకు 85 కోట్లు, వైఎస్‌ఆర్‌సీపీకి 37 కోట్లు, టీడీపీకి 25 కోట్లు, కాంగ్రెస్‌కు 17 కోట్లు, జేడీఎస్, జనసే న, జేడీ-యూ పార్టీలకు 5 నుంచి 10 కోట్ల వరకు వెళ్లాయి.
ఎన్‌ఐఎస్‌పి, ఎన్‌ఎండీసీకి చెందిన 8 మంది అధికారులు, ఎంఈసీఓఎన్-మీకాన్‌కు చెందిన ఇద్దరు అధికారులపై ఈ అవినీతి కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ బుక్ చేసింది. జగదల్‌పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించి 174 కోట్ల రూపాయల బిల్లులు క్లీయర్ చేసేందుకు అధికారులు 78 లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు తెలిపింది.
315 కోట్ల రూపాయల అవినీతిపై 2023 ఆగస్టు 10న ప్రాథమిక విచారణ జరిపినట్లు సీబీఐ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జగదల్‌పూర్‌లో ఇంటెక్‌వెల్, పంప్ హౌస్, క్రాస్ కంట్రీ పైప్‌లైన్ పనులకు సంబంధించి కాంట్రాక్ట్ ను మేఘా ఇంజినీరింగ్‌కు వచ్చింది. ప్రాథమిక విచారణ తరువాత ఈ అవినీతిపై మార్చి 31న కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.
ఎన్‌ఐఎస్‌పీ, ఎన్‌ఎండీసీకి చెందిన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రొడక్షన్) డీకే మొహంతి, డీజీఎం పీకే భుయాన్, డీఎం నరేష్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, రిటైర్డ్ సీజీఎం (ఫైనాన్స్) ఎల్. కృష్ణ మోహన్, జీఎం (ఫైనాన్స్) కే. రాజశేఖర్, మేనేజర్ (ఫైనాన్స్) సోమనాథ్ ఘోష్ లపై 73.85 లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. వీరితో పాటు మీకాన్ లిమిటెడ్‌కు చెందిన ఏజీఎం (కాంట్రాక్ట్స్) సంజీవ్ సహాయ్, డీజీఎం (కాంట్రాక్ట్స్) కె. ఇల్లవర్సుపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. మేఘా ఇంజనీరింగ్‌కు చెందిన జనరల్ మేనేజర్ చంద్ర సంగ్రాస్, మేఘా ఇంజనీరింగ్‌లో మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.