బ్యాంక్‌లకు 538 కోట్ల మేర మోసం చేసిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయాలు, సంస్థ ఛైర్మన్ నరేష్ గోయల్ నివాసంపైనా సీబీఐ శుక్రవారం నాడు దాడులు నిర్వహించింది. మొత్తం ఏడు చోట్ల సీబీఐ సోదాలు చేసింది. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయాలు, నరేష్ గోయల్ నివాసం, ఆయన భార ్య , సంస్థ మాజీ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద్ శెట్టి నివాసాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించింది. కెనరా బ్యాంక్ 538 కోట్ల మోసంపై జెట్ ఎయిర్‌వేస్‌పైనా, దాని ఛైర్మన్ పైనా ఫిర్యాదు చేయడంతో కొత్తగా సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇప్పటికే జెట్ ఎయిర్‌వేస్ రుణాల ఊబీలో కూరుకుపోయి మూతపడింది. కంపెనీని విక్రయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తీసుకున్న రుణాలను దారి మళ్లించారని కెనరా బ్యాంక్ ఫిర్యాదు చేసింది. ఈ రుణాలు చెల్లించకుండా మోసం చేశారని పేర్కొంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పరిష్కార ప్రక్రియలో జెట్ ఎయిర్‌వేస్ కోసం బిడ్ వేసిన జలాన్ కల్రాన్ కన్సార్టియం గెలుచుకుంది. ఇది ముందుకు సాగేందుకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2019లోనే జెట్ ఎయిర్‌వేస్ మూతపడింది. ప్రస్తుతం సీబీఐ నిర్వహించిన సోదాలు కొత్త యాజమాన్యానికి సంబంధంలేదని అధికారులు తెలిపారు.