Friday, November 22, 2024

క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియాపై సీబీఐ దాడులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియాపై సీబీఐ అధికారులు దాడులు జరిపి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్న వేళ బెట్టింగ్‌ రాయుళ్లు కోట్ల రూపాయల బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారన్న కీలక సమాచారం అందుకున్న సీబీఐ హైదరాబాద్‌తో పాటు ఢిల్లి, జోద్‌పూర్‌, జైపూర్‌లలో ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీష్‌, గుర్రం వాసులు కోట్ల రూపాయల బెట్టింగ్‌లు పెడుతూ సీబీఐ వలలో చిక్కారు. ఒక్కో క్రికెట్‌ మ్యాచ్‌కు బెట్టింగ్‌ రాయుళ్లు వందల కోట్లు పందాలు కాస్తున్నారని, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని సీబీఐ జరిపిన దర్యాప్తులో బయటపడింది. బెట్టింగ్‌ను అడ్డుకునేందుకు, ఈ అక్రమ దందాకు కళ్లెం వేసేందుకు పోలీసులు, సీబీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌పై సీబీఐ అధికారుల బృందం హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో అనేక కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2013 నుంచి పాకిస్థాన్‌ కేంద్రంగా ఈ అక్రమ బెట్టింగ్‌ వ్యాపారం నడుస్తున్నట్టు సీబీఐ తేల్చింది. బెట్టింగ్‌ నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌తో పాటు మరో నాలుగు నగరాలున్నట్టు సీబీఐ తేల్చింది. హైదరాబాద్‌కు చెందిన ఇరువురిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు గుట్టు తెలియని ప్రభుత్వ అధికారుల ఇళ్లపై కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌లపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సీబీఐ ఇందులో ఢిల్లికి చెందిన దిలీప్‌ కుమార్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీష్‌, గుర్రం వాసుల పేర్లు చేర్చింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా ఈ బెట్టింగ్‌ నెట్‌వర్క్‌ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిందితుల బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయగా ఇప్పటి వరకు రూ.10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్టు సీబీఐ గుర్తించింది. 2010వ సంవత్సరం నుంచి ఈ నెట్‌వర్క్‌ ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతోందని వీరితో పాటు హైదరాబాద్‌కు చెందిన మరికొంత మంది ప్రమేయం ఉందని సీబీఐ తెలిపిన దర్యాప్తులో బయట పడింది. త్వరలో వారిపై కూడా దాడులు జరిపి కేసులు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.

పాకిస్థాన్‌కు చెందిన వాకస్‌ మాలిక్‌ పేరుతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని పాకిస్థాన్‌ నుంచి వాకస్‌ మాలిక్‌ హైదరాబాద్‌లోని గుర్రం సతీష్‌తో నేరుగా ఇ-మెయిల్‌, సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు సీబీఐ గుర్తించింది. దిలీప్‌ కుమార్‌ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.43 లక్షలకుపైగా మిగులు ఉన్నట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. రెండో ఎఫ్‌ఐఆర్‌లో సజ్జన్‌ సింగ్‌, ప్రభులాల్‌ మీన, రామ్‌ అవతార్‌, అమిత్‌ కుమార్‌ పేర్లను సీబీఐ చేర్చింది. హైదరాబాద్‌ కేంద్రంగా గుర్రం సతీష్‌, గుర్రం వాసులు క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో వీరు కొంత మంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా ఐపీఎల్‌ ఆటలకు పందాలు కాస్తున్నారని సీబీఐ గుర్తించింది. తెలంగాణలోని నిజామాబాద్‌, వరంగల్‌, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరం, విశాఖపట్టణం, అనంతపురం, కడప, కర్నూల్‌, గుంటూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో ఈ ఇద్దరు తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకుని వారిద్వారా బెట్టింగ్‌లకు అవసరమైన నగదును వసూలు చేసి హవాలా ద్వారా తెప్పిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తే ఆ సమాచారం ఆదాయ పన్ను శాఖ అధికారులకు చేరుతుందని దీనివల్ల సమస్యలు వస్తాయని భావించిన ఈ ఇద్దరు బెట్టింగ్‌ రాయుళ్లు నగదును ఏజెంట్ల ద్వారా వసూలు చేసి చెల్లింపు చేసే సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నట్టు సీబీఐ అనుమానిస్తోంది. నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపేందుకు వీలుగా ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు సీబీఐ సమాచారం సేకరించింది. ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన సీబీఐ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో కూపీ లాగే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ అక్రమ దందా వెనక ఎంత మంది పాత్ర ఉందో నిగ్గు తేల్చేందుకు సీబీఐ సోదాలు చేపట్టే పనిలో నిమగ్నమై ఉంది. వచ్చే నాలుగైదు రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశముందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఢిల్లి, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక సీబీఐ బృందాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో మకాం వేసి బెట్టింగ్‌ సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement