Tuesday, November 26, 2024

Cauvery Water – క‌ర్నాట‌క‌లో ‘కావేరి’ బంద్ – స్థంబించిన జ‌న‌జీవ‌నం… విమాన స‌ర్వీస్ లకూ ఆటంకం

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు కు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ, రైతు సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ శుక్రవారం కొనసాగుతోంది. బంద్‌కు మద్దతుగా హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్యాక్సీ సేవలు కూడా పనిచేయట్లేదు. దీంతో కర్ణాటక స్తంభించింది.
అటు, బంద్‌ ప్రభావం విమాన రాకపోకలపైనా పడింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈ ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బంద్‌ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్‌ చేసుకోవడంతో ఈ విమాన సర్వీసులను రద్దు చేశారు.

ఇక కర్ణాటక రక్షణ వేదికె, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, హసిరుసేన, చెరకు సాగుదారుల సంఘం, ట్యాక్సీ- ఆటోరిక్షా సంఘాలు, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, సినిమా కళాకారుల సంఘం తదితర వందకు పైగా సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం ఆరు నుంచే బంద్‌ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసన చేపట్టారు. మైసూరులో బస్టాంట్‌ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిక్కమంగళూరులో కొందరు ఆందోళనకారులు పెట్రోల్‌బంక్‌లోకి దూసుకొచ్చి బలవంతంగా మూసివేయించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బంద్ దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు చోట్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేఆర్‌ఎస్‌ ఆనకట్ట, పర్యాటక, చారిత్రక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది.

అటు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత తమిళనాడుకు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులను ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం అర్ధరాత్రి వరకు నిలిపివేశారు. మరోవైపు కన్నడ సంఘాలకు వ్యతిరేకంగా తమిళనాడులోనూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement