తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉండి కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చబడని 40 కులాలను వెంటనే కేంద్ర జాబితాలో కలిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని బీసీ కమిషన్ తీర్మానించింది. ఇటీవల పాత ఉమ్మడి జిల్లా కేంద్రాలలో జరిపిన బహిరంగ విచారణలలో వచ్చిన వినతులను కమిషన్ ఈ రోజు ఖైరతాబాద్ లోని కార్యాలయంలో సమీక్షిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర బీసీ జాబితాలో 130 కులాలు ఉండగా, కేంద్ర ఓబిసి జాబితాలో రాష్ట్రానికి చెందిన 90 కులాలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చబడని 40 కులాలను కేంద్ర జాబితాలో కలిపేందుకు రాష్ట్రం ఇదివరకే ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.
తొలి విడతలో అక్టోబరు 28 నుండి నవంబరు 2 వరకు, రెండవ విడతలో నవంబరు 18 నుండి 26 వరకు కమిషన్ బహిరంగ విచారణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు, దొమ్మర, పిచ్చకుంట్ల, బుడబుక్కల, తమ్మలి తదితర కులాల పేర్లలో మార్పులను కోరుతూ వచ్చిన వినతులపట్ల సానుకూలంగా స్పందించిన కమిషన్ ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రభుత్వానికి తమ సిఫారసులు అందించాలని నిర్ణయించింది.
ఈ విషయంలో ప్రజాభిప్రాయాలు కోరుతూ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసి నెల రోజుల పాటు అభిప్రాయాలను స్వీకరించనుంది. ఇంకా వివిధ అంశాలపై తగు పరిశీలనలు చేసి ప్రభుత్వానికి నివేదించాలని కమిషన్ నిర్ణయించింది.
అంతకుముందు బీసీ వెల్ఫేర్ శాఖ సెక్రెటరీ ఇ. శ్రీధర్, ఐఏఎస్ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్, సభ్యులతో భేటీ అయ్యి వివిధ అంశాలు చర్చించారు. కమిషన్ సమావేశం అనంతరం అక్బరుద్దీన్ నేతృత్వంలో ఎం.ఐ.ఎం ప్రజాప్రతినిధుల బృందం కమిషన్ తో భేటీ అయ్యి ముస్లింలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై విజ్ఞాపన పత్రం సమర్పించారు.