Tuesday, November 26, 2024

Delhi | కాంగ్రెస్‌లో ‘కుల’ రాజకీయాలు.. అధిష్టానం పెద్దలతో మంతనాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. కులాలవారిగా సీట్లు, టికెట్లు డిమాండ్ చేస్తూ నేతలు దేశ రాజధానిలో ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. కొద్ది రోజుల బీసీ నేతలు రోజుల తరబడి ఢిల్లీలో నిరీక్షించి అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ నోచుకోకుండానే వెనుదిరగగా.. ఇప్పుడు ‘కమ్మ’ సామాజికవర్గం నేతలు తమకు తగినంత ప్రాతినిథ్యం కల్పించాల్సిందేనంటూ హస్తిన బాటపట్టారు. గత రెండు రోజులుగా అధిష్టానం పెద్దలతో వరుసగా మంతనాలు సాగిస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రేణుకా చౌదరి నేతృత్వంలో ‘తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక’ పేరుతో ఆ సామాజికవర్గం నేతలు రెండ్రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం వారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో వరుసగా భేటీ అయ్యారు. తెలంగాణలో తమ జన సంఖ్య 6% ఉందని, అయితే 30కి పైగా నియోజకవర్గాలను ప్రభావితం చేయగల్గిన శక్తి తమకుందని తెలిపారు.

- Advertisement -

రిజర్వుడు నియోజకవర్గాల్లో సైతం తమ వర్గం పట్టు కల్గి ఉందని, గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మద్దతుగా నిలిచిన తమ వర్గం చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిణామాల రీత్యా ఇప్పుడు కాంగ్రెస్‌కు బాసటగా నిలవాలని నిర్ణయించుకుందని తెలిపారు. 2018తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో తమ సామాజికవర్గం ఓటర్ల సంఖ్య మరింత పెరిగిందని ఐక్య వేదిక కన్వీనర్ డా. గోపాళం విద్యాసాగర్ తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తమ సామాజికవర్గానికి సరైన ప్రాతినిథ్యం, ప్రాధాన్యత లేదని తెలిపారు.

ఈసారి ఎన్నికల్లో తమ వర్గం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న నేపథ్యంలో తమకు సముచిత ప్రాతినిథ్యం కల్పించాలని, కనీసం 10 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లను తమ వర్గం నేతలకే కేటాయించాలని కోరారు. రేణుకా చౌదరి మాట్లాడుతూ మీడియా, సినిమా, పారిశ్రామిక రంగాలతో తెలంగాణలో వ్యవసాయంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న తమ సామాజికవర్గంకు రాజకీయాల్లోనూ తగినంత ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

శనివారం కమ్మ ఐక్య వేదిక నేతలు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌ను ఆయన నివాసం (నార్త్ అవెన్యూ)లో కలిశారు. అభ్యర్థుల ఎంపికలో తమ వర్గం నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎన్నికలకు అయ్యే ఖర్చును తమ వర్గం నేతలు సమకూర్చుకుంటారని, విదేశాల్లో స్థిరపడ్డ తమ వర్గం ఎన్.ఆర్.ఐలు స్వచ్ఛందంగా నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించినట్టు తెలిసింది.

సమావేశం అనంతరం రేణుక చౌదరి మీడియాతో మాట్లాడుతూ సీట్ల కేటాయింపుల్లో ‘కమ్మ’ సామాజికవర్గానికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని, సముచిత ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చెయ్యాలని మురళీధరన్ సూచించినట్టు రేణుక చౌదరి వెల్లడించారు. తాను మరో రెండ్రోజుల పాటు ఢిల్లీలో ఉండి పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని అన్నారు. తమ దగ్గర ప్లాన్ ‘ఏ’, ప్లాన్ ‘బి’ రెండూ ఉన్నాయని ఆమె అన్నారు.

బీసీ నేతల ఆవేదన

రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీలకు సీట్ల కేటాయింపులో తగినంత ప్రాతినిథ్యం కల్పించాలని కోరుతూ తాము ఢిల్లీకి వస్తే అధిష్టానం పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోజుల తరబడి నిరీక్షించేలా చేశారని, కానీ అగ్రవర్ణాలకు చెందిన సంఘాలు ఢిల్లీ రాగానే అధిష్టానం పెద్దలంతా వరుస పెట్టి అపాయింట్మెంట్లు ఇచ్చి కలుస్తున్నారని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే తాము సామాజిక న్యాయం కోరుతూ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)లో చేసిన తీర్మానం మేరకు 34 సీట్లు అడిగితే కూడా తప్పుబడుతున్నారని వారంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేకపోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం తర్వాత బీసీ ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు తరలిపోయారని, తెలంగాణ ఆ పార్టీ బలహీనపడ్డ తర్వాత బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు తరలిపోయారని కొందరు నేతలు సూత్రీకరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రాధాన్యత ఇవ్వకపోతే బీసీ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement