అందరికీ సమాన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కులగణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా పరిగణిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బోయినపల్లిలోని ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన కులగణన సంప్రదింపుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ…
తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, అందుకు కులగణన ప్రక్రియే నిదర్శనమన్నారు. కాగా, కుల గణన సర్వే కోసం.. పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ నేరుగా రావడం గొప్ప విషయమన్నారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు.
కులగణన సర్వేకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కుల గణన పూర్తి చేసి రాష్ట్రంలోని బీసీలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కుల గణనను 2025 జనాభా గణనలో పరిగణనలోకి తీసుకోవాలని వేదికపై తీర్మానం చేశారు.