హైదరాబాద్, ఆంధ్రప్రభ : న్యాయపర ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కులగణన కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో కలిసి మంత్రి విలేఖరులతో మాట్లాడారు.
ఈ నెల 6న ఈ కార్యక్రమాన్ని గవర్నర్ కుటుంబ వివరాలతో ప్రారంభించామని, 8వ తేదీ వరకు 1,16,14,349 కుటుంబాలను గుర్తించామని చెప్పారు. ఈ నెల 17 (ఆదివారం) వరకు 67,72,246 లక్షల కుటుంబాల వివరాలను నమోదు చేశామని, మొత్తం 58.6 శాతం సర్వే జరిగిందని మంత్రి వెల్లడించారు.
ఈ నెల 30 వరకు కులగణన పూర్తవుతుందని, వివరాలను క్రోడీకరించి ప్రజలకు ఆన్లైన్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఏ కుటుంబానికి ఏ అవసరం ఉంటుందని ఈ సర్వే ద్వారా తేలనుందని, రాష్ట్రంలో చేపట్టిన ఈ కార్యక్రమం దేశానికే రోల్ మోడల్ కానుందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు తమ (మంత్రి ) కుటుంబం వివరాలను సైతం కులగణనలో ఇప్పటికే నమోదు చేసుకున్నామని, తాను తమ జిల్లా ఖమ్మంలో నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్లు , ఆదనపు కలెక్టర్లు ,జిల్లా యంత్రాంగం 75 అంశాల ఫార్మాట్ సర్వే కార్యక్రమంలో బిజీగా ఉన్నారని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు కేటీఆర్, హరీష్ రావు కూడా కులగణన సర్వేలో తమ కుటుంబాల వివరాలను నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నమోదు చేసుకున్నందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు.
ఇప్పటి వరకు ములుగు జిల్లాలో అత్యధికంగా 87.1 శాతం, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 81. 4 శాతం, జనగామలో 77.6 శాతం, హైదరాబాద్‌లో 38.3 శాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం పూర్తయిన అనంతరం వాటి వివరాల ప్రకారం ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామన్నారు.