న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా కులాలవారిగా జనాభా లెక్కల సేకరణ చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జాతీయ బీసీ కమిషన్‌ను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కోరింది. శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహిర్‌ను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. కులాలవారిగా జనాభా లెక్కలు తేలినప్పుడే వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించగలమని ఆయన చెప్పారు.
దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కూడా కోరారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ, రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వానికి జాతీయ బీసీ కమిషన్ సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఓబీసీ విద్యార్థులకు 27% రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో నరేందర్ గౌడ్‌తో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గిరగాని బిక్షపతి పాల్గొన్నారు.