Friday, November 22, 2024

పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు పెగింది.. ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గణాంకాల ప్రకారం చూస్తే పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు తగ్గకపోగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. నల్లధనానికి, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడం కోసమే నోట్ల రద్దు చేసినట్టు వెల్లడించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లడమే లక్ష్యమని సమాధానంలో పేర్కొన్నారు. 2016లో చెలామణిలో ఉన్న నోట్ల విలువ రూ. 16,63,300 కోట్లు కాగా, మార్చి 2022 నాటికి రూ. 31,33,691 కోట్లని ఆమె వెల్లడించారు. 2017లో మాత్రమే రూ. 13,35,200 కోట్లు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. జీడీపీ నగదు నిష్పత్తి 2017లో 8.7 శాతం ఉండగా అది మార్చి 2022 నాటికి 13.7 శాతానికి పెరిగిందని తెలిపారు.

ఆర్థిక మంత్రి జవాబుపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. 2016 నవంబర్‌లో అమలు చేసిన నోట్ల రద్దు లక్ష్యాలన్నింటినీ సాధించడంలో విఫలమైనట్టు ఎట్టకేలకు బీజేపీ ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ఆర్థిక మంత్రి చెప్పినట్టు నోట్ల రద్దు లక్ష్యాలేవీ మోడీ ప్రభుత్వం సాధించలేదని కేంద్ర డేటాయే స్పష్టంగా చూపిస్తోందని ఆయన విమర్శించారు. అవినీతి, పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్ వంటి అక్రమ మార్గాల ద్వారా సంపాదిస్తున్న నల్లధనం చెలామణిని అరికట్టడమే నోట్ల రద్దు లక్ష్యమని ప్రధానమంత్రి ప్రకటించినా నోట్ల రద్దు లక్ష్యం మాత్రం నెరవేరలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో పెద్దమొత్తంలో నల్లధనం గుర్తింపు జరగలేదని, ఆ దిశగా కేంద్రం పెద్దగా చేస్తున్న ప్రయత్నాలేమీ లేవని ఆయన చెప్పుకొచ్చారు.

నల్ల ధనం కలిగి ఉన్నవారు తమ పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోగలిగారని విమర్శించారు. నోట్ల రద్దు ఆర్థిక మందగమనానికి దారి తీసిందని, నోట్ల కొరత కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రి  అందించిన డేటా పెద్ద నోట్ల రద్దు అనాలోచిత చర్య అని రుజువు చేసిందని, ఇది తీవ్ర ఆర్థిక పరిణామాలకు దారి తీస్తుందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసకర పథకాలను అమలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేసినందుకు ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ కుమా్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement