హైదరాబాద్,ఆంధ్రప్రభ : సినీ హీరో వేణుపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు అయింది. ఈక్రమంలో బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ, సినీ హీరో వేణుతో పాటు ఓ ప్రజా ప్రతినిధిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ కాంట్రాక్ట్‌ను తెహ్రీడెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు దక్కింది.
సదరు సంస్థ ఈ పనులను బంజారాహిల్స్‌కు చెందిన స్వాతి కస్ట్రక్షన్స్‌తో పాటు రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే స్వాతి కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టు మధ్యలోనే తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్స్ మాత్రం పనులు కొనసాగించింది.
ఇది జరిగింది…
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు కాంట్రాక్టు పనులకు సంబంధించి తెహ్రీడెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.450 కోట్లు- విడుదల చేసింది. ఇందులో 5.5 శాతం ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ తీసుకుని మిగిలిన 94.5 శాతం నగదును రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంట్స్‌కు బదిలీ చేసింది.
కాంట్రాక్టు కేటాయింపులో చోటు చేసుకున్న వివాదంతో ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ, తెహ్రీడెవలప్ మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మరో రూ.1,010 కోట్లు- విడుదలయ్యాయి. విడుదలైన ఆ మొత్తాలు ఈ రెండు సంస్థల జాయింట్ అకౌంట్లోకి జమ అయ్యాయి.
ఒప్పందం ప్రకారం ఈ డబ్బులను వాటాల వారీగా తీసుకోవాల్సి ఉంది. అయితే తెహ్రీడెవలప్ మెంట్ కార్పొరేషన్‌తో ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ఒప్పంద హక్కులను రద్దు చేసుకుంది. అటు- సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న రిత్విక్ ప్రాజెక్టుతో సైతం ఒప్పంద హక్కులను రద్దు చేయడంతో రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి. రవి కృష్ణ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
పథకం ప్రకారమే రద్దు…
తెహ్రీడెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అందిన మొత్తం డబ్బులను దక్కించుకునేందుకే ఉద్దేశపూర్వకంగా తమతో ఒప్పందం రద్దు చేసుకున్నారని రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్వహిస్తున్న కావూరి భాస్కర్‌రావుతో పాటు మరో ప్రజాప్రతినిధి, హీరో వేణు, పీసీఎల్ సంస్థ డైరెక్టర్ కె. హేమలత, భాస్కర్ రావు సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. దీంతో హీరో వేణుతో పాటు- మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.