భారత, అమెరికా చట్టాలను ఉల్లంఘించారు
లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తుతాం
ఇతర కుంభకోణాల్లోనూ అదానీ పాత్ర
అండగా ప్రధాని మోదీ ఉంటున్నారు
ఆయనపైనా అనుమానాలున్నాయి
లోతైన దర్యాప్తు చేయాలన్న కాంగ్రెస్ ముఖ్యనేత
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ:
అదానీ గ్రూపు సంస్థ ఓనర్ గౌతం అదానీపై అమెరికా కోర్టులో నేరాభియోగాలు నమోదు అయ్యాయి. న్యూయార్క్ జడ్జి తన ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం స్పందించారు. గౌతం అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు స్పష్టం అవుతున్నదని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అదానీ కలిసి ఉంటే, ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని పేర్కొన్నారు. అదానీని తక్షణమే అరెస్టు చేయాలన్నారు.
లోక్‌సభలో లేవనెత్తుతాం..
ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతాని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ చెప్పారు. అదానీ నేరాలపై జేపీసీ విచారణ జరిపించాలన్న డిమాండ్ కొనసాగుతుందన్నారు. భారత సర్కారు గౌతం అదానీకి రక్షణగా నిలుస్తోందని, ఆయన్ను అరెస్టు చేయడం కానీ విచారణ చేయడం కానీ జరగదని గ్యారెంటీ ఇస్తున్నట్లు తెలిపారు. గౌతం అదానీ ఎందుకు ఈ దేశంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారని ప్రశ్నించారు. రెండు వేల కోట్ల స్కామ్‌తో పాటు ఇతర కుంభకోణాల్లో ఆయన పాత్ర ఉన్నట్లు తెలిసినా ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని అడిగారు.
ప్రధాని మోదీ పాత్రపై అనుమానాలు..
దేశంలోని ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారు కానీ, అదానీ మాత్రం పరారీ అవుతున్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ అంశాన్ని ఎన్నాళ్ల నుంచో ప్రశ్నిస్తున్నామని, కానీ గౌతం అదానీని ప్రధాని మోదీ రక్షిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ఈ స్కామ్‌లో ప్రధాని మోదీ పాత్ర ఉన్నట్లు కూడా ఆరోపించారు.