కోల్‌కతాలో పోలీసు అధికారుల మీద దాడి చేసినట్టుగానే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న పోలీసులను, పోలీసు అధికారులను చితకబాదాలని బీజేపీ కార్యకర్తలకు ఆ పార్టీ నేత, బీజేపీ కార్పొరేటర్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా పశ్చిమబెంగాల్లో ఏసీపీని దొరకబట్టుకుని బీజేపీ నేతలు, కార్యకర్తలు చితకబాదుతున్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి తెలంగాణలో కూడా ఇలాగే చేయాలని కోరారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు అతనిపై యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. కార్పొరేటర్ ఫేస్‌బుక్ ఐపీ అడ్రస్ ఆధారంగా ఇవ్వాల (బుధవారం) కేసు నమోదు చేశారు.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన బీజేపీ లీడర్‌పై యాక్షన్ తీసుకున్నారు. పోలీసులపై దాడులకు దిగాలని కోరినందుకు బీజేపీ కార్పొరేటర్ కే నర్సింహారెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో పోలీసులపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలను మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కే నరసింహారెడ్డి మంగళవారం రాత్రి తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో అప్‌లోడ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ పోలీసులను టార్గెట్ చేసి.. వారిపై కూడా దాడి చేయాలని ఆయన పరోక్షంగా పార్టీ కార్యకర్తలను కోరారు.
దీంతో కార్పొరేటర్ సోషల్ మీడియా ఖాతాను గమనించిన పోలీసులు అతనిపై భారత శిక్షాస్మృతిలోని 153 ఎ, 505 (2), 506, 189 కింద కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన పోలీసులు కార్పొరేటర్ ఖాతాల స్క్రీన్‌షాట్‌లు, ఐపీ అడ్రస్‌లను సేకరించారు. కోల్‌కతాలోని హౌరా స్టేషన్ దగ్గర ఉన్న రోడ్డు మార్గంలో మంగళవారం ఇటుకలు, బ్యాట్‌లతో తరలివచ్చిన మూక గ్యాంగును ఒక వీడియోలో చూడొచ్చు. అటుగా వచ్చిన పోలీసు సిబ్బందిని టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. ఆ ప్రాంతంమతా యుద్ధభూమిని తలపించింది. బెంగాల్ అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శన కోసం ప్రత్యేక రైళ్లలో తరలిచవ్చిన బీజేపీ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.