కరోనా మహమ్మారి బ్రిటన్‌ను మళ్లీ భయపెడుతోంది. జులై నాటికి పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ఇప్పుడు వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. వ్యాక్సిన్ పంపిణీ చేపట్టిన తర్వాత మహమ్మారి తీవ్రత తగ్గింది. దాంతో ప్రభుత్వం నిబంధనలను ఎత్తివేసింది. మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. స్కూళ్లు, హోటళ్ల దగ్గర్నుంచి అన్ని వ్యాపార కలాపాలకు అనుమతులు ఇచ్చింది. ఫలితంగా ప్రజలు స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించారు. కనీస జాగ్ర త్తలను విస్మరించారు.
ఈ పరిస్థితులే వైరస్ వ్యాప్తికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. రెండు వారాలుగా రోజువారి కేసులు 35-40 వేల మధ్య నమోదవుతున్నాయి. సోమవారం ఈ సంఖ్య 50వేల మార్కును దాటేసింది. తద్వారా జులై నాటి గరిష్టానికి చేరాయి. మరణాలు కూడా 100కుపైగానే నమోదవుతున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిమ్ నెయిస్మిత్ పేర్కొన్నారు.
విద్యార్థుల్లో నమోద వుతున్న కరోనా కేసులే ప్రస్తుత ఉధృతికి కారణమని రీడింగ్ వర్సిటీ నిపుణుడు క్లార్క్ అభిప్రాయపడ్డారు. యూకేలో 40 శాతం మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. అయినప్పటికీ వైరస్ నియంత్రణలోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసుల్లో 10-15శాతం డెల్టా వేరియంట్ అనుబంధ రకా నివే ఉంటున్నట్లు తేలింది. కొత్త వేరియంట్‌ను ఏవై.4.2గా గుర్తించారు. డెల్టా కంటే ఇది 10శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్నారు.