ఈ భూగోళంలో జురాసిక్ పీరియడ్‌లో వివిధ రకాల డైనోసార్లు (రాకాసిబల్లులు) జీవించాయని తెలుసు. వాటిలో భారీవి.. చిన్నవి, ఎగిరేవి ఇలా అనేక రకాలవి జీవించాయి. ఆ తరువాత అనేక పరిణామ దశలు దాటి రూపురేఖల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. భూగోళంపై ఉల్కాపాతాలు, గ్రహశకలాలు పడటంతో అవి అంతర్ధానమైనాయని చరిత్ర చెపుతోంది. అయితే, స్పెయిన్‌లో ఒకప్పుడు మాంసాహార రాకాసిబల్లులు జీవించాయని తాజాగా ఆధారాలు లభించాయి. క్రెటాసియస్ కాలంలో (జురాసిక్ పీరియడ్ తర్వాత) స్పెయిన్‌లో ఇవి సంచరించాయని, పైగా ఉభయచరాలని శాస్త్రవేత్తలు బలంగా చెబుతున్నారు. తూర్పు స్పెయిన్‌లోని సముద్రతీరంలో ని కేస్టెల్లోన్‌లో తవ్వకాల్లో దొరికిన డైనోసార్ పాక్షిక కళేబరాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సరికొత్త విషయాలను ప్రపంచానికి వెల్లడించారు.
మాంసాన్ని చీల్చి నమలడానికి వీలుగా బలమైన వంకలు తిరిగిన కోరపళ్లు, అమాంతం మింగేసేలా మొసలి తరహా కపాలం వాటికి ఉండేవని తేల్చారు. ఇవి అటు నేలమీద… నీళ్లలోనూ వేటాడే సామర్థ్యం కలిగినవని వారు చెబుతున్నారు. ఇవి సమూహంగా వేటాడేవని, డైనోసార్లలో అత్యంత విజయవంతమైన సమూహాలని వారు తేల్చారు. 126 -127 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ఈ రెండుకాళ్ల మాంసాహార రాకాసి బల్లులకు ప్రొటథ్లిటిస్ సిన్‌క్టోర్రెన్‌సిస్‌గా పిలుస్తున్నారు. ఈ శాస్త్రీయ నామానికి అర్థం.. చాంపియన్ ఫ్రమ్ సిన్‌క్టోర్రెస్ అని. 33 నుంచి 36 అడుగుల పొడవు, 2 టన్నుల బరువుతో ఉండేవి.
ఇవి అతిపెద్ద మాంసాహార రాకాసి బల్లులైన స్పినోసారస్ వర్గానికి చెందినవిగా భావిస్తున్నారు. తాజాగా దొరికిన ఈ డైనోసార్ కళేబరంలో కుడి దవడ ఎగువ ఎముక, ఒక పన్ను, ఐదు వెన్నుపూసలు లభ్యమైనాయి. ఇదే ప్రాంతంలో రెండుకాళ్ల శాఖాహార డైనోసార్‌లు, మొసళ్లు, షార్క్ చేపలు, ఇతర చేపల అవశేషాలు కూడా లభ్యమైనాయి. తూర్పు తీరంలో ఇవి తరచూ భూమి మీదే వేటాడేవని, ఎప్పుడోగాని సముద్రంలోని చేపలను వేటాడేవి కాదని జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్ ప్రధాన రచయిత, స్పెయిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ క్యుబెడోకు చెందిన ప్రొ. ఆండ్రెస్ శాంతోస్ అభిప్రాయపడ్డారు.