అక్టోబర్ 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల టోకేనైజేషన్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సైబర్ నేరగాళ్ల భారినపడి కార్డుదారులు మోసపోతున్నారు. కార్డుల ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు వివరాలను స్టోర్ చేస్తున్నారు. భవిష్యత్ చెల్లింపుల సమయంలో కార్డు వివరాలన్నీ ఇవ్వకుండానే సీవీవీ నెంబర్‌తో లావాదేవీలు పూర్తి చేస్తున్నారు. ఇక నుంచి కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరంలేకుండా కార్డు టోకేనైజేషన్ విధానం ద్వారా చెల్లింపులు జరపవచ్చు. ఇది అత్యంత సురక్షితమైనదని ఆర్బీఐ తెలిపింది.
టోకెన్ ద్వారా చెల్లింపుల విధానంలో కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరంలేదు. కార్డు జారీ చేసిన సంస్థ వినియోగదారుడికి ఒక నెంబర్ కేటాయిస్తుంది. దీన్ని ఉపయోగించి లావాదేవీలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఏదైనా వస్తువులు కొని, ఆన్‌లైన్‌లోనే చెల్లించే సమయంలో కార్డు వివరాలన్నీ పూర్తిగా ఇస్తున్నారు. ఈ వివరాలను ఆయా ఇ- కామర్స్ వెబ్‌సైట్లు భద్రపరుస్తున్నాయి. మొబైల్ కంపెనీలు కూడా యాప్ ద్వారా చేసే చెల్లింపుల సమయంలో కార్డు వివరాలను సేవ్ చేస్తున్నాయి. ఒక వేళ ఆయా వెబ్‌సైట్లను ఎవరైనా హ్యాక్ చేస్తే కస్టమర్ల వివరాలు సైబర్ నేరస్ధుల చేతికి పోతున్నాయి. దీని వల్ల కస్టమర్లు నష్టపోతున్నారు.
టోకేనైజేషన్ తరువాత కార్డు వివరాలు వ్యాపారి, ఇ-కామర్స్ సైట్స్‌లో కాకుండా కేవలం బ్యాంక్‌ల వద్దే ఉంటాయి. కస్టమర్లు ఎక్కడ కొనుగోలు చేసిన చెల్లింపులు చేసినా కార్డు వివరాలు ఎక్కడా నమోదు కావు. కేవలం టోకెన్ నెంబర్ ద్వారా మాత్రమే లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. ఇలా టోకెన్ నెంబర్ పొందడానికి కస్టమర్లు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. మర్చంట్స్ వెబ్‌సైట్‌లో కార్డులో చివరి నాలుగు అంకెలు మాత్రమే సేవ్ అవుతాయి. మిగిలిన వివరాలన్నీ కార్డు జారీ చేసిన బ్యాంక్ వద్ద ఉంటాయి.
కస్టమర్లు కార్డును టోకేనైజేషన్ చేసుకునేందుకు వీరు ఐదైనా కొనుగోలు చేసే సమయంలో వివరాలు నమోదు చేస్తారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మీ కార్డును సేవ్ చేయడం జరిగిందని వస్తుంది. దీని తరువాత ఓటీపీ వస్తుంది, దీన్ని ఎంటర్ చేసిన తరువాత మీ కార్డు టోకేనైజేషన్ పూర్తవుతుంది. ఆ తరువాత మీరు కొనుగోలు చేసిన ప్రతిసారి మీ కార్డులో చివరి నాలుగు అంకెలు నమోదు చేస్తే సరిపోతుంది.