హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్) కార్ల రేసులు తొలి రోజు ముగిశాయి. శనివారం జరగాల్సిన క్వాలిఫైయింగ్ పోటీలు జరపకుండా నిర్వాహకులు రెండు ప్రాక్టీస్ సెషన్ మాత్రమే నిర్వహించారు. వర్షం పడడంతో ఉదయం 11 గంటలకు జరగాల్సిన రేసింగ్ పోటీలను తొలుత మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. క్వాలిఫైయింగ్ పోటీలను ఆదివారమే నిర్వహించాలని ఐఆర్‌ఎల్ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం.
మళ్లి అవే తప్పిదాలు…
గత నెలలో జరిగిన ఐఆర్‌ఎల్ తొలి విడత రేసుల సందర్భంగా జరిగిన తప్పదాలనే నిర్వాహకులు ఈసారి చేస్తున్నారు. మధ్యాహ్నం రేసింగ్ ప్రారంభమైన తర్వాత రెండు కార్లు రేస్ మధ్యలో ఆగిపోవడంతో రెండుసార్లు రెడ్ ఫ్లాగ్స్ వచ్చాయి. సాంకేతిక కారణాలతో స్పోర్ట్స్ కార్లు చాలా ఆలస్యంగా ట్రాక్ ఎక్కాయి. ఆదివారం ఐఆర్‌ఎల్ మూడు క్వాలిఫైయింగ్ రేసులు ఉంటాయి. దీంతో అందరి చూపు ఆదివారం రేసులపైనే ఉంది. రేసింగ్‌ను చూసేందుకు వచ్చే వీక్షకులు శనివారం తక్కువగానే ఉన్నా ఆదివారం భారీ ఎత్తున హాజరవుతారన్న ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా-ఈ రేసులకు సన్నద్ధమయ్యేందుకు ఈ రేసులు నిర్వహించేందుకు అనుమతిచ్చినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.